12 April, 2026 | 2:03 AM

గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలి

12-04-2026 12:00 AM

గవర్నమెంట్ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ డిమాండ్

పంజాగుట్ట, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్క రించాలని కోరుతూ గవర్నమెంట్ డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొర్ర ఈశ్వర్ లాల్, ప్రధాన కార్యదర్శి చల్లా నరేందర్ మాట్లాడుతూ..

ప్రస్తుతం అమలులో ఉన్న పీరియడ్ ఆధారిత వేతన విధానం వల్ల గెస్ట్ లెక్చరర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో వచ్చే సెలవులు, పరీక్షల కాలంలో వేతనాలు అందక లెక్చరర్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారని వారు ఆరోపించారు. ప్రస్తుతం అమలవు తున్న పీరియ డ్, క్రెడిట్ ఆధారిత గౌరవ వేతన విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. నెలకు 72 పీరియడ్లకు ఇచ్చే రూ. 28,080ల వేతనాన్ని, ఎటువంటి షరతులు లేకుండా 12 నెలలకు వర్తించేలా కన్సాలిడేటెడ్ పేగా మార్చాలని కోరారు.

ముఖ్యంగా యూజీసీ నిబంధనలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. నెలకు రూ. 50,000 వేతనాన్ని అమలు చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని వారు స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకొని ఉత్తర్వులు జారీ చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు సి.హెచ్ వెంకటేశం, మాతంగి రాజు, డాక్టర్ ఇసరం శ్రీనివాస్, డి.తేమాజీ, ట్రెజరర్ జనార్ధన్, ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.