calender_icon.png 14 December, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటమ్స్ పేలలే!

14-12-2025 01:04:39 AM

  1. అక్కడ బ్లాస్ట్.. ఇక్కడ తుస్
  2. ఈ ఏడాది పాటల ‘ప్రత్యేక’త ఇదీ

ఈ ఏడాది ‘ఐటమ్స్’ చాలా వరకు పేలలేదు. బాలీవుడ్‌లో బ్లాస్ట్ కాగా, దక్షిణాదిన తుస్ పటాకా అనిపించాయి. నిరుడు స్పెషల్ సాంగ్స్ కొన్ని సంచలనం సృష్టించాయి. కిందటేడాది వచ్చిన పాటల్లో ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలో ‘కిస్సిక్’ చెప్పుకోదగ్గది. శ్రీలీల నటించిన తొలి ఐటెం సాంగ్ ఇది. ఇది సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది. అయితే, ఈ ఏడాది ప్రత్యేకంగా చెప్పుకునే స్థాయిలో ఐటమ్ భామలు అలరించలేకపోయారు.

ఐటమ్ సాంగ్స్ ఉన్న సినిమాలు చాలా వరకు వచ్చినా ఏదీ ప్రేక్షకులను స్టెప్పులు వేయించేంతగా మెప్పించలేపోయింది. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అలరిస్తాయనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. 

అందాల భామలు అదిరేటి స్టెప్పులేస్తుంటే థియేటర్లన్నీ మోత మోగిపో తాయంతే! యువ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ ఈలలు వేస్తూ ఉర్రూతలూగాల్సిందే! ముఖ్యంగా స్టార్స్ సినిమాలకు ప్రత్యేక గీతాలు ఎప్పుడూ సమ్‌థింగ్ స్పెషలే. ఆ పాటను ఎందుకు పెడతారనే ప్రేక్షకులు కొందరైతే, ఆ ఐటమ్ ఉంటే ఎంజాయ్ చేసేవాళ్లు మరికొంత మంది ఉంటారు. కమర్షియల్ సినిమాల్లో ఐటమ్ సాంగ్ ఆనవాయితీగా వస్తోంది.

ఈ 2025లో కూడా ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది సినిమాల్లో ప్రత్యేక గీతాలు చాలానే వచ్చాయి. బాలీవుడ్‌లో చాలా పాటలు ప్రేక్షకులను అలరించాయి. టాలీవుడ్ సహా దక్షిణాది సినిమాల్లో ఐటమ్ భామల అందచందాలు, అదిరేటి స్టెప్పులు ప్రేక్షకులకు అంతగా కిక్కెక్కించలేకపోయాయి. ఊర్వశి రౌతేలా, తమన్నా భాటియా నటించిన ఐటం సాంగ్స్ యువతను ఉర్రూతలూగించాయి. రష్మిక మందన్న, నోరా ఫతేహీ కూడా ప్రత్యేక గీతాలతో అలరించారు. 

ఈ ఏడాది ‘ప్రత్యేక’త ఇదీ.. 

‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్ షాలిని పాండే ‘రాహు కేతు’ సినిమాలో ‘మధిర’ అనే ప్రత్యేక గీతంలో నటించింది. పులకిత్ సామ్రాట్, వరుణ్‌శర్మతో చేసిన ఈ పాట పెద్దగా ఆకట్టుకోలేదు. షాలిని గ్లామర్‌తో ఎంత ఆకట్టుకోవాలని చూసినా సాంగ్ ప్రేక్షకులను ఆకర్షిం చలేకపోయింది. మెట్రో శిరీష్ రూపొందించిన ‘నాన్ వైలెన్స్’ మూవీలోని ‘కనకం’ పాట కూడా ప్రేక్షకుల మనసు గెలుచుకోలేకపోంది. ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ నటించిన ప్రత్యేక గీతమిది.

తమిళ్‌లో రవిమోహన్ హీరోగా ‘జినీ’ సినిమా విడుదలైంది. ఇందులో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ చేసిన స్పెషల్ సాంగ్ ప్రేక్షకుల మనసులు గెలుచుకోలేదు. అందాల భామలు ఇద్దరు గ్లామర్ ట్రీట్ చేసినా లాభం లేకపోయింది. ‘భాగి4’లో జాకీష్రాఫ్‌తో సోనం బజ్వా చేసిన ప్రత్యేక గీతం ‘అకేలీ లైలా’. ఇది కూడా ఆకట్టుకోలేదు. లుక్స్ పరంగా సోనం ఆకర్షించినప్పటికీ పాట మాత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేదు.

ఇక ఐటమ్ సాంగ్స్‌కు కేరాఫ్‌గా మారిన మలైకా అరోరా ఈసారి నటించిన ‘పాయిజన్ బేబీ’ సాంగ్‌తో ప్రత్యేక గీతాల ప్రియులకు మత్తెక్కించలేకపోయింది. ‘థామా’ సినిమాలోని ఈ గీతంలో మలైకా అందాలు ఆకర్షించినా పాటపరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇదే సినిమాలో తమన్నా చేసిన పాటలు అలరించాయి. 

టాప్ ఐటెం సాంగ్స్ ఇవే.. 

బాలీవుడ్ హీరో సన్నీడియోల్ కథానాయకుడిగా నటించిన ‘జాట్’ చిత్రంలో ‘సారీ బోల్’ పాట ఆకట్టుకుంది. ఊర్వశి రౌతే లా హై-ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌లో నటించింది. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అజయ్ దేవగన్, రితేశ్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రైడ్2’ సినిమాలోని ‘నాషా’ చార్ట్‌బస్టర్‌గా మారింది.

తమన్నా భాటియా నటించిన సిజ్లింగ్ ట్రాక్ ఇది. ఇందులో తమన్నా తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ‘ఆజాద్’ చిత్రంలోని ‘ఉయి అమ్మ’ పాట కుర్రకారు గుండెలు జారేలా చేసింది. రవీనా టాండన్ కూతురు రషా తడాని బాలీవుడ్ అరంగేట్రం చేసిన సినిమా ఇది. ఇందులో ఈ ముద్దుగుమ్మ ఆమాన్ దేవగన్‌కు జోడీగా నటించింది.