13-12-2025 01:30:00 AM
లిప్ లాక్‌లు.. ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడానికి అభ్యంతరం చెప్పే హీరోయిన్లు చాలా తక్కువ. దర్శకుడి విజన్ మేరకు ఎంత పెద్ద హీరోయిన్ అయినా, నో చెప్పకుండా రంగంలోకి దిగిపోతున్నారు. కెరీర్ ఆరంభంలో నో చెప్పినవాళ్లు కూడా ఈ తోవలోకి వస్తున్న సందర్భాలెన్నో! కొంతకాలంగా తెలుగింటి భామలు కూడా ముంబై ముద్దుగుమ్మలకు ధీటుగా నటిస్తున్నారు. అయితే, తెలుగమ్మాయి కుషిత కల్లపు మాత్రం ఆ తరహా పాత్రలకు దూరమంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ సీన్స్ గురించి మాట్లాడింది. “లిప్ కిస్ అయితే పెట్టను. ఇష్టముండదు. ఇంట్లోనూ ఒప్పుకోరు.
ఇంటిమేట్ సీన్స్ కూడా కొంతవరకే. నేను పెళ్లి చేసుకోవాలి. నా మొదటి ముద్దు అయినా.. హగ్ అయినా నా భర్తకు మాత్రమే. కెరీర్ విషయంలో రాజీ పడేదిలేదు. సినిమా అవకాశాల కోసం ఎలా పడితే అలా నటించాలనే ఆలోచన నాకు లేదు” అని తెలిపింది. చాంగురే బంగారు రాజా, నీతోనే, బాబు నెంబర్ వన్ బుల్షిట్ గయ్ లాంటి చిత్రాల్లో కుషిత నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన వెబ్‌సిరీస్ ‘త్రీ రోజెస్ ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఆహా ఓటీటీలో ఈ సిరీస్ డిసెంబర్ 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, సూర్య శ్రీనివాస్ , సత్యం రాజేశ్, రాశీసింగ్‌తోపాటు కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించింది. దీనికి రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా.. కిరణ్ కే కరవల్ల దర్శకత్వం వహించారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌కు డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.