కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి
- రాజకీయాలకు అతీతంగా నీటి పంపింగ్ చేపట్టాలి
- మంత్రి ఉత్తమ్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ
సిద్దిపేట, ఆగస్టు 10 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను సకాలంలో నింపి రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డిని కోరుతూ సోమవారం లేఖ రాశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల కార ణంగా గోదావరిలోకి వచ్చే వరద నీటిని ఒడిసిపట్టి ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మిడ్‌మానేరు రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 22 టీ ఎంసీల నీటి లభ్యత ఉందని తెలిపారు.
మిడ్‌మానేరు నుంచి మోటార్లు ఆన్ చేసి అన్నపూర్ణ (అంతగిరి), రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, నృసింహ (బస్వాపూర్) రిజర్వాయర్లకు నీటిని పంపిం గ్ చేయాలని కోరారు. ఈ రిజర్వాయర్లతో పాటు వాటి పరిధిలోని చెరువులు, చెక్‌డ్యామ్‌లను నింపడం ద్వారా సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. అలాగే 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన లోయర్ మానేరు డ్యామ్‌లో ప్రస్తుతం 6.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి నీటిని తరలించి ఎస్‌ఆర్‌ఎస్పీ స్టేజ్-2 ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు.






