calender_icon.png 9 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వసూల్’ రాజాలు..!

09-12-2025 01:50:18 AM

  1. ఐఎంఎఫ్‌ఎల్ డిపోలో వసూళ్ల పర్వం.. ఫస్ట్ డెక్ లో ఉండాలి..

ఎక్సైజ్, డిపో అధికారుల చేతివాటం

మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వైన్స్ దుకాణాల నుండి వసూళ్లు

ప్రతిరోజు వే బిల్లుకు ఒక్కో దుకాణానికి రూ. 500 చెల్లించాల్సిందే..

కొల్చారం, డిసెంబర్ 8 :మెదక్ జిల్లా కొ ల్చారం మండలం చిన్నఘనపూర్ తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఐ ఎంఎఫ్‌ఎల్) డిపోలో ఎక్సైజ్ అధికారులు, డిపో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. నూతన వైన్స్ దుకాణాల యజమానులు, బార్ల యజమానుల నుండి డబ్బులు వసూలుకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని చిన్నఘనపూర్ ఐఎంఎఫ్‌ఎల్ డిపో నుండి మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 118 వైన్స్ దుకాణాలకు, 16 బార్లకు ప్రతిరోజు దుకాణాల డిమాండ్ మేరకు మద్యం సరఫరా చేస్తారు.

ఈనెల మొదటి తేదీ నుండి ప్రారంభమైన నూతన వైన్స్ దుకాణాలు, బార్ యజమానుల నుండి భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు సంవత్సరాల వరకు మీ దుకాణాలకు మేమే మద్యం సరఫరా చేయాలి. అడిగిన బ్రాండ్ మద్యం సరఫరా చేయాలంటే, మద్యం సకాలంలో సరఫరా చేయాలంటే ఐఎంఎఫ్‌ఎల్ డిపోలో ఒక్కో వైన్స్, బార్ కు సుమారుగా రూ.15వేలకు పైగా డబ్బులు ఇవ్వాలంటూ హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

దీంతో చేసేదేమీ లేక మద్యం దుకాణాల యజమానులు డబ్బులు చెల్లించి డిపో నుండి మద్యం తీసుకెళ్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలోని 118 వైన్స్ దుకాణాలు, 16 బార్ల యజమానులు ఎక్సైజ్, ఐఎంఎఫ్‌ఎల్ డిపో అధికారు లు ఆదేశించిన విధంగా మద్యం తీసుకెళ్లారు.

ప్రతిరోజు వే బిల్లుకు రూ.500 ఇవ్వాల్సిందే...

చిన్నఘణపురం ఐఎంఎఫ్‌ఎల్ డిపో నుండి మద్యం తీసుకెళ్లేందుకు ప్రతిరోజు వచ్చే వాహనాలకు మద్యం లోడ్ అయిన తర్వాత వే బిల్లుపై రెవెన్యూ స్టాంప్ అతికించి స్టాంపు వేసి ఇవ్వడానికి ఒక్కో బిల్లుకు రూ.500 వసూలు చేస్తున్నారు. చిన్నచిన్న దుకాణాల యజమానులు ఇద్దరు, ముగ్గురు కలిసి మద్యం లోడ్ నింపితే మూడు వైన్స్ లకు సంబంధించిన మూడు బిల్లులకు రూ.1500 వసూలు చేస్తున్నారు.

అసలు ఇదేం అన్యాయమని దుకాణాల యజమానులు ప్రశ్నిస్తే వారికి ఆరోజు మద్యం లోడు కాకుండా అడ్డుకుంటున్నారని వాపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు, సిబ్బంది అడిగిన విధంగా డబ్బులు ఇస్తూ మద్యం దుకాణాల యజమానులు డిపో నుండి మద్యం తీసుకెళ్తున్నారు.

పంపకాల్లో తేడాతో...

డిపో అధికారులు, డిపోలో పనిచేసే ఎక్సైజ్ సిబ్బంది మెదక్, సంగారెడ్డి జిల్లాలోని వైన్స్ దుకాణాలు, బార్ల నుండి వసూలు చేసిన డబ్బుల పంపిణీలో బేధాభిప్రాయాలు రావడంతో ఈ విషయం బయ టకు పోక్కింది. వైన్స్ దుకాణదారులు సైతం బయటకు చెప్పుకోలేక మథనపడుతున్నారు. యజమానులు గట్టిగా ప్రశ్నిస్తే వారి వాహనంలో లోడ్ చేయకుండా అడ్డుకుంటు న్నారని వాపోతున్నారు. 

తనకేమీ తెలియదు...నాగేశ్వరరావు డీఎం, ఐఎంఎఫ్‌ఎల్ డిపో

ఐఎంఎఫ్‌ఎల్ డిపోలో వైన్స్, బార్ల యజమానుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న విషయం తనకు తెలియదు. ఈ విషయం తన దృష్టికి రాలేదు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం.