31 August, 2026 | 2:07 AM

భూమిపై హక్కు ఉన్నట్టా..లేనట్టా?

31-08-2026 01:30 AM
  1. కేసముద్రంలో భూముల పరిస్థితి అగమ్య గోచరం.!
  2.    22ఏతో నిషేధిత జాబితాలోకి ఆబాది భూములు

కేసముద్రం, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన 22 ఏ ఉత్తర్వు ద్వారా కేసముద్రం పట్టణంలో కూడా ఆబాది పరిధిలో ఉన్న అనేక ఎకరాల భూమి నిషేధిత జాబితాలో తీర్చడంతో, ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి, ప్రజలు తమ ఆస్తులు ఉన్నట్టా లేనట్టా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు గ్రామాలుగా ఉన్న కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, దనసరి, సబ్ స్టేషన్ తండా, అమీనాపురం విలీనం చేసి కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో పట్టణాన్ని ప్రకటించే ముందు రెవెన్యూ పరిధిలో పలు సర్వే నెంబర్లలో ఉన్న భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి గృహ నిర్మాణాలు, ఇతర నిర్మాణాలు ఉన్న భూములను ఆబాది పరిధిలోకి మార్చలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనితో చాలా సర్వే నంబర్లలో కొంత భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి, విక్రయించగా అందులో  గృహ నిర్మాణాలు, ఇతర వాణిజ్యసముదాయాల నిర్మాణాలు చేపట్టారు.

అక్కడక్కడ కొంత భూమిని తమ స్వాధీనంలో ఉంచుకోవడం వల్ల ఆ భూములు రెవెన్యూ రికార్డుల నుండి తొలగించకుండా అలాగే ఉంచారు. ప్రభుత్వం ద్వారా రైతుబంధు, రైతు బీమా పథకాలను కూడా అందుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం 22ఏ ద్వారా కేసముద్రం రెవెన్యూ గ్రామ పరిధిలో 12 కు పైగా సర్వే నంబర్లలో సుమారు 800 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చిందంటున్నారు.

దీనితో అనేక సర్వే నంబర్లలో దశాబ్దాల క్రితం గృహ నిర్మాణాలు చేసుకున్న వారి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఇటీవల వారి ఆస్తులను విక్రయించడం, కొందరు కొత్తగా కొనుక్కోవడం జరిగింది. వాటిని ఇటీవల రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్లగా మీ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి

రిజిస్ట్రేషన్లు చేసే పరిస్థితి లేదంటూ వెనక్కి పంపించడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. దీనికి తోడు కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ పరిధిలో అధికారులు కూడా ఆస్తులకు సంబంధించిన యాజమాన్య పత్రాలను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఫలితంగా కేసముద్రం మున్సిపాలిటీలో ఆస్తుల క్రయవిక్రయాలు పూర్తిగా స్తంభించాయి. 

అసైన్డ్ భూములే అధికం

కేసముద్రం ఉమ్మడి రెవెన్యూ గ్రామ పరిధిలో అత్యధికంగా అసైన్డ్ భూములే ఉన్నాయి. ఇందులో చాలా సర్వే నంబర్లలో భూమి ఎక్కువ భాగం ఆబాది పరిధిలోకి వచ్చింది. వందల సంఖ్యలో ఇండ్ల నిర్మాణం, వాణిజ్య సముదాయాలు, ఇతర వ్యవసాయేతర కార్యకలాపాలకు భూములను వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఆ భూములన్నింటినీ 22 ఏ ప్రకారం 12 సర్వే నంబర్లలలో  1,198 సబ్ డివిజన్లలో సుమారు 800 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మంత్రిగారు.. మీరే మాకు దిక్కు

కేసముద్రం పట్టణ పరిధిలో ఉన్న భూములను సమగ్రంగా సర్వే చేయించి, ఆబాది పరిధిలోకి తీసుకువచ్చి, గృహ నిర్మాణాలు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములకు మున్సిపాలిటీ ద్వారా ఇంటి నంబర్లు కేటాయించి, హక్కులు కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కేసముద్రం పట్టణ ప్రజలు కోరుతున్నారు. 22 ఏ పేరుతో అనేక సంవత్సరాల నుండి భూములను ఆధారంగా చేసుకుని జీవిస్తున్న వారికి అన్యాయం జరగకుండా చూడాలని వేడుకుంటున్నారు.

నేడు కేసముద్రం పర్యటనకు వస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి 22ఏ నిషేధిత జాబితా భూముల అంశాన్ని తీసుకువెళ్లి, భూముల రీ సర్వే నిర్వహించి అర్హులైన వారందరికీ భూ భారతి ద్వారా ‘భూధార్’ నంబర్లు కేటాయించి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజలు కోరుతున్నారు. 

పట్టా భూమి అయినప్పటికీ రిజిస్ట్రేషన్ చేయడం లేదు

కేసముద్రం పట్టణ పరిధిలో నాలుగు దశా బ్దాల క్రితం పట్టా భూమి కొనుగోలు చేసి అందులో గృహ నిర్మాణం చేపట్టి ఇటీవలి కాలం వరకు గ్రామపంచాయతీకీ, కొత్తగా ఏర్పగా మున్సిపాలిటీకీ హౌస్ టాక్స్ చెల్లించినప్పటికీ యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. అలాగే పట్టా భూమిని కూడా నిషేధిత 22 ఏ జాబితాలో ఉన్నట్లు పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. ఈ ఆస్తిని ఆధారంగా చేసుకుని బతుకుతున్నాం. పిల్లల చదువు కోసం ఇటీవల మా ఇంటిని విక్రయించడానికి భయాన తీసుకొని, రిజిస్ట్రేషన్ చేయించడానికి వెళితే, మీ భూమి నిషేదిత జాబితాలో ఉందంటూ తిరస్కరించారు. ఇప్పుడు మా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 

 కల్యాణి, గృహిణి, కేసముద్రం టౌన్