13 July, 2026 | 3:28 AM

చివరి అతిథి

13-07-2026 02:29 AM

ఒకరోజు ఎలాంటి కబురూ లేకుండా

నా గుమ్మం దగ్గరకు

ఒక అతిథి వస్తాడు

అతని అడుగుల సవ్వడి వినిపించదు

కానీ కాలమైతే

అతని రాక కోసమే

ఇన్నాళ్లూ ఎదురుచూసినట్టుంటుంది

వచ్చినతను

నా గది తలుపు తట్టడు

నన్ను పేరు పెట్టి పిలవడు

పరిచయం అడగడు

ఐనా..

నా గురించి నాకంటే 

ఎక్కువ తెలిసినవాడిలా

నేరుగా నా నిశ్శబ్దంలోకి అడుగుపెడతాడు

అప్పటి వరకు నేను పదిలంగా దాచుకున్న

నవ్వులూ... కన్నీళ్లూ...

గెలుపులూ... ఓటములూ...

ఒక్కొక్కటిగా శిశిరంలో ఆకుల్లా 

అతని పాదాల దగ్గర రాలిపోతాయి !

అప్పుడు అర్థమవుతుంది 

మనిషి జీవితం మాత్రమే కాదు,

సొంతమని నమ్ముకున్నవన్నీ

ఒక అల తాకగానే

చెరిగిపోయే ఇసుక గీతలేనని 

అతడైతే ఏమీ తీసుకువెళ్లడు..

కానీ, నన్ను ఖాళీ చేతులతోనే 

వెళ్లాల్సిందేనని నెమ్మదిగా గుర్తు చేస్తాడు

అతని స్పర్శలో 

ఏ మాత్రం ఓదార్పు ఉండదు

సుదీర్ఘ ప్రయాణం ముగిసిన తర్వాత 

కన్నతల్లి ఒడిలో తలవాల్చినంత 

హాయిగా ఉంటుంది