అక్రమ ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్న దమ్మపేట ఫారెస్ట్ రేంజర్
దమ్మపేట, ఆగష్టు 28(విజయక్రాంతి): పాల్వంచ అటవీ డివిజన్ పరిధిలోని దమ్మపేట అటవీ రేంజ్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా గురువారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో పుసుకుంట చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పూసుకుంట చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఇసుక లోడుతో వచ్చిన సదరు ట్రాక్టర్ను అటవీ శాఖ సిబ్బంది తనిఖీ చేయగా, ఇసుక రవాణాకు సంబంధించి అవసరమైన చెల్లుబాటు అయ్యే అనుమతి పత్రాలు లేనట్లు గుర్తించబడిందని, దీంతో సదరు ట్రాక్టర్ను ఇసుక లోడుతో సహా స్వాధీనం చేసుకొని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం అటవీ శాఖ ఆధీనంలో ఉంచడం జరిగిందని, కేసు నమోదు చేసి, తదుపరి విచారణ మరియు చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి కె శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి కె శ్రీను మాట్లాడుతూ....
దమ్మపేట అటవీ డివిజన్ పరిధిలో అటవీ మరియు సహజ వనరుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలను నిరంతరం కొనసాగించడంతో పాటు, అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలించడం, అటవీ ప్రాంతాలు, పరిసర ప్రాంతాల నుండి సహజ వనరులను అనుమతులు లేకుండా తరలించడం చట్టవిరుద్ధమైన చర్యలుగా పరిగణించబడతాయని, ప్రజలు ఎటువంటి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. అక్రమ ఇసుక రవాణా లేదా అటవీ వనరుల అక్రమ తరలింపుకు సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే, అటువంటి సమాచారాన్ని సమీప అటవీ శాఖ అధికారులకు అందించి అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణలో అటవీ శాఖకు సహకరించాలని కోరారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలియజేశారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజల సహకారం భాగస్వామ్యం అత్యంత అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.






