17-02-2026 01:15:12 AM
క్యాతనపల్లి చైర్మన్ కోసం కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
మందమర్రి, ఫిబ్రవరి 16: మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార పార్టీ విశ్వ్ర పయత్నాలు చేస్తోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. సోమవారం క్యాతనపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లతో కలిసి మాట్లాడారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో పది బీఆర్‌ఎస్, నాలుగు సీపీఐ గెలుచుకున్నప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం జరగాల్సిన ప్రమాణ స్వీకారాన్ని పోలీసులతో కలిసి కౌన్సిల్‌కు హాజరు కాకుండా ఇబ్బందులకు గురి చేసి వాయిదా వేశారన్నారు. కొందరు కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు గుండాయిజం చేస్తున్నారని, ఇది సరైన పద్దతి కాదన్నారు. క్యాతనపల్లి బీఆర్‌ఎస్, సిపిఐ కౌన్సిలర్లు ఉన్న క్యాంపుపై దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, భద్రాచలంలోని నందిని హోట ల్లో క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను చెదరగొట్టేందుకు పోలీసులు హోటల్‌పై దాడి చేశారన్నారు.
పోలీసులు సైతం అధికార పార్టీకి చుట్టాలుగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వాలు మారుతుంటాయని అది గమనించాలన్నారు. ఈ నెల 17న నిర్వహించే ప్రమాణ స్వీకారాన్ని సైతం చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా మంత్రి, పోలీసుల సహకరించి పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి సహకరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్, సీపీఐ కౌన్సిలర్లు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, బీఆర్‌ఎస్ నియోజక వర్గ నాయకులు రాజారమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
క్యాతనపల్లి చైర్మన్ ఎంపిక నేటికి వాయిదా
రామకృష్ణాపూర్(మందమర్రి), ఫిబ్రవరి 16 : మందమర్రి మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారం 17న నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు ఎన్నికలు జరగగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావే శానికి కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను వాయిదా వేసినట్లు స్పెషల్ ఆఫీసర్, తహశీల్దార్ సతీష్ కుమార్ వెల్లడించారు.