01-10-2025 06:37:30 PM
దేవాలయాల మాదిరిగానే నిత్యం పూజలు.
పవిత్రమైన పుణ్యక్షేత్రాల నుండి మట్టి సేకరణ.
నవగ్రహాలు, పంచభూతాలకు విగ్రహ ప్రతిష్టాపన.
సామాజిక సేవా కార్యక్రమాలలో ట్రస్ట్.
చిట్యాల (విజయక్రాంతి): మహాత్మా గాంధీ ఆలయంలో మన బాపూజీ నిత్యం పూజలు అందుకుంటున్నాడు. అవును మీరు విన్నది నిజమే.. గాంధీకి గుడి ఉంది అని మీకు తెలుసా..?
అక్టోబర్ 2 గాంధీజీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
ప్రతి భారతీయుడు నేడు స్వేచ్ఛ వాయువులు పీల్చుతున్నారంటే ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలే... అహింసా మార్గాన్ని ఎంచుకొని తెల్లదొరలను తరిమికొట్టిన ఘనత ఒక్క మహాత్మా గాంధీజీ కే దక్కుతుంది. జాతిపితగా జనహృదయాల్లో సుస్థిర స్థానం అయినదే. అంతటి మహనీయుడికి గుడి కట్టి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 65పై పెద్ద కాపర్తి అనే గ్రామ శివారులో నాలుగు ఎకరాల విశాలమైన స్థలంలో హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే దారి కి ఆనుకొని హైదరాబాద్ నుండి కేవలం 70 కిలోమీటర్ల దూరం లో మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రశాంతమైన వాతావరణంలో మహాత్మా గాంధీ గుడి నిర్మించబడింది.
ఆలయ నిర్మాణం:
2012 సంవత్సరంలో మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. 2014 సెప్టెంబర్ 17న మహాత్మ గాంధీ పాలరాతి విగ్రహం ప్రతిష్టించారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుని జ్ఞాపకాలు భావితరాలకు అందాలని, దేశానికి ఆయన చేసిన సేవలు ముందు తరాలు తెలుసుకోవాలని ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో పైన నిర్మించిన ఆలయ గర్భగుడిలో మహాత్ముని యొక్క నలుపు రంగు రాతి విగ్రహం, ఎదురుగా ధర్మచక్రం ప్రతిష్టించబడి ఉండగా, క్రింది ఆలయంలోని ధ్యాన మందిరంలో తెలుపు రంగు రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉప ఆలయాలుగా పంచ తులసి కోట, నవగ్రహాల ప్రతిష్టాపన, పంచభూతాలను విగ్రహరూపాలలో ప్రతిష్టాపన చేసి ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మహాత్ముడికి నిత్య పూజలు:
గాంధీ గురించి ఎంత చెప్పినా ఇంకా తరగని పుస్తకం ఆ మహాత్ముని వ్యక్తిత్వం. దైవం మానవ స్వరూపేనా అనే మాటకు ఆయన నిలువెత్తు నిదర్శనం. కరెన్సీ నోట్లపై కనిపించే గాంధీ బొమ్మ ఇలా గాంధీ గుడిలో పూజలు అందుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. గాంధీ ఆలయంలో మహాత్మా గాంధీ నిత్య పూజలు అందుకుంటున్నారు. అన్ని దేవాలయాల మాదిరిగానే ధూప, దీప, నైవేద్యం, ధ్యాన, ఆవాహన, గాంధీజీ అష్టోత్తరం, గాంధీజీ శతనామకరణం, సుప్రభాత సేవలు, అర్చనలు లాంటి అనేక పూజలు గాంధీ మహాత్ముడు నిత్యం అందుకుంటున్నాడు. ఆలయం ముందు ఉన్న మర్రి చెట్టుకు కోరికలు నెరవేరాలని ముడుపు కట్టే సంప్రదాయం ఇక్కడ కలదు. ప్రతిరోజు వందల మంది భక్తులు మహాత్ముడి దర్శనం చేసుకుంటున్నారు. ధ్యాన కేంద్రం లో నిత్యం ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు ధ్యానం నిర్వహిస్తారు.
పుణ్యక్షేత్రాల నుండి మట్టి సేకరణ:
మహాత్మా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ పుణ్యక్షేత్రాల నుండి పవిత్రమైన మట్టిని సేకరించి ఆలయంలో గాజు బాక్స్ లలో వేదమంత్రోచ్ఛారణల నడుమ భద్రపరచడం జరిగింది. ఈ పవిత్రమైన మట్టిని తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. వైష్ణో దేవి ఆలయం, ఉజ్జయిని మహాకాళేశ్వరి ఆలయం, త్రివేణి సంగమం, తిరుపతి దేవస్థానం, మధుర మీనాక్షి, పూరి జగన్నాథ్ మదురై శ్రీకృష్ణ, సిద్ధి వినాయక టెంపుల్, రామేశ్వరం, మహాలక్ష్మిదేవి ముంబై, చిదంబరం నటరాజ స్వామి, బద్రీనాథ్, అనంత పద్మనాభ స్వామి, ముంబాదేవి, ఇలా పవిత్రమైన దేవస్థానాల నుండి, సబర్మతి ఆశ్రమం, రాజ్ ఘాట్ ల నుండి మట్టిని సేకరించి భద్రపరిచారు. పవిత్ర గ్రంధాలైన జనవాణి, పవిత్ర ఖురాన్, హోలీ బైబిల్, సత్యశోధన గాంధీ ఆత్మకథ, గీతా మకరందం, గురు గ్రంధ సాహెబ్ అనే పవిత్ర గ్రంధాలను ఆలయంలో గాజు పలకలలో అమర్చారు.
సామాజిక సేవ కార్యక్రమాలలో..
ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రతినిత్యం వచ్చిపోయే భక్తులకు, పేదలకు అన్న ప్రసాద వితరణ, ప్రభుత్వ పాఠశాలలకు బెంచీలను, నోట్ బుక్స్, పెన్స్, వృద్ధులకు దుప్పట్ల పంపిణీ, ఆటో డ్రైవర్లకు చొక్కాలు, యువకులకు క్రికెట్ కిట్ లు, ట్రస్ట్ దత్తత తీసుకున్న గ్రామాలలో వివాహ ఆహ్వాన పత్రిక అందినట్లయితే వధూవరులకు పట్టు వస్త్రాలు, వివిధ సేవా కార్యక్రమాలను ట్రస్ట్ నిర్వహిస్తుంది.
ట్రస్ట్ నిర్వాహకులు:
గౌరవ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మేనేజింగ్ ట్రష్టి శ్రీపాల్ రెడ్డి, సెక్రటరీ :పివి కృష్ణారావు, నరసారెడ్డి, ట్రస్టీలు: డాక్టర్ సీత, శైలజ రెడ్డి, డాక్టర్ రానా,డాక్టర్ వీణ రెడ్డి, ట్రస్ట్ పర్యవేక్షకుడు:జిట్టా నరేష్, ఆలయ అర్చకుడు చోల్లేటి పవన్ కుమార్.