01-10-2025 07:21:08 PM
జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ..
గద్వాల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడానికి అధికారులు పూర్తి బాధ్యతతో పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ అన్నారు. బుధవారం ఐడిఓసి సమావేశం హాలు నందు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు,స్టాటిక్ సర్విలేయన్స్ బృందాలతో సమావేశం నిర్వహించి ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుండి కౌటింగ్ ముగిసే వరకు ఎలాంటి అక్రమ చర్యలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ మొత్తం 13 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
24/7 పర్యవేక్షణతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన, ఆక్రమంగా డబ్బు, మద్యం సరఫరా, ప్రలోభాలు, బహుమతులు ఇవ్వడం వంటి వాటిని పకడ్బందీగా నియంత్రించాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్యాత్మక ప్రదేశాలలో ప్రత్యేకమైన ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు సకాలంలో చేరుకొలేని పక్షంలో కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. జిల్లాలోని నలు మూలల చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో నాలుగు చెక్‌పోస్టుల వద్ద 12 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను, మూడు షిఫ్టులలో చురుకుగా విధులు నిర్వర్తించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా వాహనాల్లో రూ.50,000 లేదా కొత్త వస్తువులు, రూ.10,000 కంటే పైగా విలువైన బహుమతులు ఎక్కువగా రవాణా అవుతున్నట్లు కనిపిస్తే, స్పష్టమైన ఆధారాలు లేకుండా సందేహాస్పదంగా ఉంటే వెంటనే వాటిని సీజ్ చేయాలని, స్వాధీనం చేసుకున్న వస్తువులను పూర్తిగా వీడియో కవర్‌తో సీజ్ చేయాలని ఆదేశించారు.
ప్రతి సీజ్‌కు అనుబంధము - బి ప్రకారంగా రసీదు ఇవ్వాలన్నారు. స్వాధీనం చేసిన వస్తువులు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో భద్రపరచాలని అన్నారు. తనిఖీలు మర్యాదపూర్వకంగా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలన్నారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్.ఎస్.టీ బృందాలు తనిఖీల వివరాలను ఎప్పటికప్పుడు రిపోర్టు చేయడం అత్యంత అవసరమన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రతీ ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం, లేదా ప్రలోభాలకు గురిచేయడం లాంటి ఏ కార్యక్రమం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు, డిఎస్పీ మొగల్లయ్య, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్విలేయన్స్ బృందాలు, తదితరులు పాల్గొన్నారు.