01-10-2025 07:13:57 PM
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ లో ఘోరం జరిగింది. కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి ఓ ప్రయాణికుడు రైలు కిందపడి రెండు కాళ్లు తెగిపోయి మృతి చెందిన ఘటన తాండూర్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలోని చించోలిలో పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మారుతి అనే వ్యక్తి పనులు పూర్తి చేసుకొని తిరిగి బెంగళూరుకు వెళ్లే క్రమంలో తాండూరులో దిగాడు. అంతలోనే రైలు కదులుతుండడంతో రైలు ఎక్కబోయి అదుపుతప్పి రైలు కింద పడి రెండు కాళ్లు శరీరం నుండి విడిపోయాయి. వెంటనే స్థానికులు అతడిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోని మృతి చెందాడు. పోలీసులు మృతుడి జేబులో ఉన్న గుర్తింపు కార్డులను చూసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.