తెలంగాణ యాస అచ్చినోళ్లంతా ఈడియోలు పెట్టుర్రి!
చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా. ఈ సినిమా విజయం చిన్న చిత్రాల్లో ఎంతో స్ఫూర్తి నింపింది. ఇలాంటి బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న ‘రాజు వెడ్స్ రాంబా యి’ మేకర్స్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టా రు. తెలంగాణలో పుట్టిన మరో మట్టి కథ పరిమళాన్ని ప్రేక్షకులకు అందించ బోతున్నారు. ఈ చిత్రాన్ని డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, ఆరాధ్య సినీ క్రియేషన్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, సంధ్య భాను చల్లా నిర్మిస్తున్నారు. మధుకర్ రెడ్డి కోమిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో నటించేందుకు ఔత్సాహిక నటీనటులకు మేకర్స్ ఆహ్వానం పలుకుతున్నారు. “ఇద్దరు అన్నదమ్ముల పంచాయితీ తెలంగాణలోని జమ్మికుంట అనే ఊరు రాతనే ఎలా మార్చింది? వారిలో ఎవరు గెలిచినా ఊరు మాత్రం ఎందుకు ఓడిపోయింది? రామాయణంలో రామలక్ష్మణుల్లా కలిసి ఉండాల్సిన అన్నదమ్ములు మహాభారతంలో సోదరుల్లా గొడ్డళ్లు ఎందుకు పట్టుకున్నారు? ఏ ఇంట్లోనూ జరగకూడని ఈ కథలో అసలు ఏం జరిగింది? ఈ అన్నదమ్ముల పంచాయితీ ఏందో అంతా కలిసి చూద్దాం” అంటూ రూపొందించిన కాస్టింగ్ కాల్ ఆసక్తిని కలిగిస్తోంది. ‘తెలంగాణ యాస బాస అచ్చిన తెలుగోళ్లంతా ఈడియోలు పెట్టుర్రి’ అని ప్రకటించారు. నటన పట్ల ప్యాషన్, ప్రతిభ ఉన్నవారికి ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.






