15 April, 2026 | 8:49 AM

ముక్కోటి ఉత్సవాలు గడువులోపు పూర్తి చేయాలి

16-12-2025 12:51 AM

కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాచలం, డిసెంబర్ 15, (విజయక్రాంతి)పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈనెల 29, 30 తేదీలలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామీ వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం నకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులందరి సహకారముతో అప్పగించిన విధులను సకాలంలో పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం నాడు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిర్వహణపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశంలో సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట, ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ తో కలసి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సమావేశంలో వివిధ శాఖల అధికారులకు నిర్దేశించిన పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ముక్కోటి మహోత్సవ పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు రెవెన్యూ, పోలీస్ శాఖ సమన్వయంతో చేయడం జరుగుతుందని, లాడ్జి, హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించామని అన్నా రు .

ఆలయ పరిసరాల్లో సీసీటీవీ లు ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభించా లని, భద్రాచలం, దుమ్ముగూడెం లోని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించా లని సూచించారు. భక్తులు మహోత్సవాలు వీక్షణకు ఎల్‌ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని, హంస వాహనం తనిఖీ చేసి దృవీకరణ నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఈ ఈ ని ఆదేశించారు. హంస వాహనంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అధికారులను అనుమతించాలన్నారు.

భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రాచలం పట్టణంలో మరియు పర్ణశాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల నిర్వాణ ఎంపీడీవో తాసిల్దార్ చూసుకోవాలని, దుమ్ముగూడెంలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టే విధంగా సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి సెక్టార్కు ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని అన్నారు.

భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా అయ్యే విధంగా డిఇ డబ్ల్యు ఎస్, పబ్లిక్ హెల్త్ శాఖ వారు చూసుకోవాలని, భక్తులకు బస్సులు, రైల్వే సమయాలను, అలాగే జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను, ఎవరైనా భక్తులు తప్పిపోతే తెలియజేసే విధంగా సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐ ఎన్ డి పి ఆర్ శాఖ వారికి ఆదేశించారు.

ఆర్టీసీ తరఫున వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్యశాఖ తరఫున పర్ణశాల మరియు భద్రాచలంలో మొబైల్ టీమ్లు పర్యవేక్షణతో పాటు అంబులెన్సులు ఏరి యా ఆసుపత్రిలో పది బెడ్లు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని డి ఎం హెచ్ ఓ కు ఆదేశించారు. భక్తుల వాహనాలను పార్కింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు సైనేజ్ బోరడ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

తెప్పోత్సవం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలతో పాటు, భద్రాచలం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుచుటకు గాను గత సంవత్సరం ఏర్పాట్లు చేసిన మాదిరిగానే భద్రాచలం ప్రాముఖ్యత తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గిరిజన సాంప్రదాయ వంటకాలు, వస్తువులు ప్రతిబింబించే విధంగా స్టాల్స్ ఏర్పాటు అలాగే ఏరు ఫెస్టివల్ కు సంబంధించిన పనులు రేపటినుండి ప్రారంభించాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉన్నందున ఘనంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు.

భద్రాచలం యొక్క ప్రాముఖ్యతను తెలిపే విధంగా ఇప్పటికే గోడపత్రికలను పంపిణీ చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా భక్తులు అధిక సంఖ్యలో రావచ్చని, భద్రాచలాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి పరుచుటకు గాను గిరిజన మ్యూజియం మరియు దుమ్ముగూడెంలోని బొజ్జగుప్ప గ్రామాన్ని పర్యాటకులు సందర్శించి గిరిజనుల యొక్క సాంప్రదాయం కట్టడాలు, పర్యాటకులు ఆహ్లాదకరంగా గడపడానికి వివిధ రకాల సాంప్రదాయమైన ఇండ్లు, అదేవిధంగా అదేవిధంగా గోదావరిలో పుట్టి ప్రయాణం చేయడానికి సంబంధిత ఈతగాళ్లకు ఈనెల 22, 23 తేదీలలో ప్రత్యేక శిక్షణ అందించాలని, తెప్పోత్సవ మహోత్సవం తిలకించడా నికి వచ్చే భక్తులకు కానీ, ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఘనంగా ఏర్పాటు చేయాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో శ్రవణ్ కుమార్, ఎస్ ఎస్ ఆర్ డి ఈ ఈ రవీంద్రనాథ్, ఇరిగేషన్ ఏఈ శ్యామ్, ఏడీఎం హెచ్ ఓ సైదులు, విద్యుత్ శాఖ డీఈ జీవన్ కుమార్, ఆర్ అండ్ బి డి సతీష్, మధ్య శాఖ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఖాన్,వివిధ శాఖల డివిజన్ అధికారులు, తాసిల్దారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.