గిరిజన విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలి
ఐటీడీఏ ఉపాధ్యాయులను కోరిన పిఓ రాహుల్
భద్రాచలం, డిసెంబర్ 15, (విజయక్రాంతి):గిరిజన విద్యార్థులు చదువుతోపాటు కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా సంబంధిత ప్రిన్సిపాల్ మరియు లెక్చరర్ లు చొరవ చూపాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం నాడు తన చాంబర్లో ఖమ్మం గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులకు గ్రూప్స్ మెయిన్స్ సంబంధించిన కోచింగ్ పుస్తకాలను కొనుగోలు చేయడానికి 45 వేల రూపాయల చెక్కును అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించినప్పుడు కళాశాల విద్యార్థులు IIT-JEE, NEET, CLAT మరియు హోటల్ మేనేజ్మెంట్ ప్రవేశ పరీక్షలతో సహా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి రిఫరెన్స్ పుస్తకాల కోసం అభ్యర్థించారని అన్నారు.
పోటీపరీక్షలకే కాకుండా, విద్యార్థులలో నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలు, వివిధ రకాల పెయింటింగ్ చిత్రాలలో నైపుణ్యం తెచ్చుకునేలా అవగాహన కల్పించి క్రమశిక్షణతో కూడిన అధ్యయన పద్ధతులను అవలంబించేలా సంబంధిత లెక్చరర్లు వారిలో స్ఫూర్తి నింపుతూ ఉండాలని అలాగే కెరిర్ గైడెన్స్ కు సంబంధించిన అంశాలు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను పిలిపించి వారి చేత విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని అన్నారు.
విద్యార్థులు అందుబాటులో ఉన్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు విద్యార్థులు వారి విద్యా మరియు కెరీర్ లక్ష్యాలలో రాణించడానికి అవసరమైన మద్దతును ప్రిన్సిపాల్ లెక్చరర్లు అందిస్తున్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రజిని తదితరులు పాల్గొన్నారు.






