09-07-2025 12:00:00 AM
నేడు గురుదత్ శతజయంతి :
సంప్రదాయ పద్ధతుల్లో ముందుకు వెళ్తున్న హిందీ చిత్ర పరిశ్రమ పరంపరను బద్ధలు కొడుతూ తనదైన సృజనతో, తనదైన శైలితో వెండితెరకు కొత్త రంగులు అద్దిన దర్శక ధీరుల్లో గురుదత్ ఒకరు. మూస పద్ధతిలో కాకుండా, ఒకింత సౌందర్యాన్ని, సంగీతాన్ని, కవిత్వాన్ని జోడించి సినిమాకు మెరుగులద్దారు. గురుదత్ 9 జూలై 1925లో కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించారు. చిన్నప్పటి నుంచి గురుదత్‌కు చిత్ర రంగంపై ఆసిక్తి ఉండేది.
కొంతకాలం ఆయన నృత్య దర్శకుడు ఉదయ్‌శంకర్ వద్ద శిక్షణ పొందారు. ఆయన 1940లో ముంబై చేరుకున్నారు. కొంతకాలం కొరియోగ్రాఫర్‌గా చిత్ర పరిశ్రమలో పనిచేశారు. ఈక్రమంలో అప్పటి స్టార్ దేవానంద్ పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 1951లో వారిద్దరి కలయికలో వచ్చిన చిత్రమే ‘బాజీ’. గురుదత్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు.
జల్ (1952), జాల్ (1952), బాజ్ (1953), ఆర్ పార్ (1954), మిస్టర్ అండ్ మిసెస్ 55 (1955), సైలాబ్ (1956), ప్యాసా (1957), కాగజ్ కే పూల్ (1959) ఆయన తీసిన చిత్రరాజాలు. గురుదత్, వహీదా రెహ్మాన్ కలయికలో వచ్చిన ‘ప్యాసా’ చిత్రం ఇండియన్ సెల్యూలాయిడ్‌పై ఒక చెరగని సంతకం. భారతదేశంలో రూపుదిద్దుకున్న టాప్ చిత్రాలను ఎవరు షార్ట్ లిస్ట్ చేసినా, అందులో ‘ప్యాసా’ ఉంటుందనేది నిర్వివాదాంశం.
ప్రఖ్యాత ‘టైమ్ మ్యాగజైన్’ రూపొందించిన ప్రపంచంలోనే 100 గొప్ప చిత్రాల్లో ఈ చిత్రం చోటు దక్కించుకున్నది. కానీ, గురుదత్ ప్రాణం పెట్టి దర్శకత్వం వహించిన ‘కాగజ్ కే పూల్’ చిత్ర పరాజయం ఆయన్నెంతో కుంగదీసింది. కాలం గడిచినా కొద్దీ.. ఆ చిత్రానికి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. అదే చిత్రం తర్వాత అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. ప్రస్తుతం ‘కాగజ్ కే పూల్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 11 యూనివర్సిటీల్లో ఫిల్మ్ కోర్సు విద్యార్థులకు అధ్యయన పాఠంగా ఉంది.
పాటల చిత్రీకరణలోనూ గురుదత్‌కు విలక్షణ శైలి ఉంది. ‘జల్’ చిత్రంలోని ‘చాందినీ రాతీన్ ప్యార్‌కి బాతేన్ ఖో గయీ జానే కహాన్’, ‘ప్యాసా’లోని ‘యే దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యా హై’, ‘కాగజ్ కే పూల్’లోని ‘ఉడ్ జా ఉడ్ జా ప్యాసే భన్వారే’ అనే పాటల చిత్రీకరణ గురుదత్ అభిరుచికి ప్రతీకలు.
1964లో హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘సాంఝ్ ఔర్ సవేరా’ గురుదత్ ఆఖరి చిత్రం. ‘కాగజ్ కే పూల్’ ఘోర పరాజయం, సంసార జీవితంలో ఒడిదుడుకులు ఆయన్ను కుదిపేశాయి. ఒంటరితనంలో ఆయన తాగుడికి దగ్గరయ్యారు. చివరకు అదే ఆయన ప్రాణం తీసిందని కొందరంటారు.
రుద్ర