09-07-2025 12:00:00 AM
సార్వత్రిక జనాభా లెక్కలు ముగిసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న వార్తలతో చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి రానుంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు.
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్లలో మహిళలకు 51 సీట్లు దక్కుతాయని, వాటికి అదనంగా మరో 9 సీట్లు కలిపి 60 సీట్లు కేటాయించే బాధ్యత తనదేన ని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది ఎంతో ముదావహం. అంతా సవ్యం గా జరిగితే 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం సంకల్పం తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది.
పార్లమెంట్‌లో మహిళలకు పార్లమెంట్, అసెంబ్లీ సీట్లలో మూడిం ట ఒకవంతు సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్ల బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ 2023లోనే చట్టరూపం పొందింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఈ చట్టం అమలు ముడిపడి వుంది. 2027 మార్చి నుంచి జరిగే జనగణన, కులగణన ఆ మరుసటి ఏడాది పూర్తవుతుంది.
సార్వత్రిక ఎన్నికలలోగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను కొత్తగా ఏర్పరుచుకునే ప్రక్రియ పూర్తి కావాల్సి వుంది. మొత్తంగా జనాభా డేటా ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోనున్నాయనే వాదన ఉండనే వుంది.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయినా సరైన సంఖ్యలో రాజకీయ ప్రాతినిధ్యం కోసం మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరిగినా, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం అంతంతమాత్రమే. మహిళలకు చట్టసభల్లో పెద్దపీట వేస్తామని రాజకీయ పార్టీలు ఇన్నేళ్లుగా చెపుతున్నా ఆచరణ మాత్రం నామమాత్రంగానే మిగిలింది. వారికి పార్టీల పరంగా దక్కిన టికెట్లు కూడా తక్కువే.
వారికి రాజకీయ చైతన్యం, నాయకత్వ ప్రతిభ తక్కువనే భావన మూస పద్ధతిలో కొనసాగింది. ప్రజాస్వామ్య విధానానికే ఇది విఘాతం కలిగిస్తుంది. విధాన నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం ఉంటే, ఆ ప్రక్రియ కిందిస్థాయి నుంచి జరిగితేనే ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతుంది. మహిళా రిజర్వేషన్ ఈ దిశగా ముందడుగు కానున్నది.
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లు ప్రకారం 15 ఏళ్ల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయి. అవసరమనుకుంటే ఆ తర్వాత కొనసాగింపునకు సమీక్ష జరుపుకోవచ్చు. గతంలో, పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది.
పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో ఇది చారిత్రాత్మకమైంది. ఆ తర్వాత పరిణామాలే ఈ అంశంపై ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న రీతిలో సాగా యి. 2023లో చట్టరూపం పొందడానికి ముందు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సుదీర్ఘ చరిత్రే వుంది. రిజర్వేషన్ బిల్లును 1996 నుంచి పార్లమెంట్‌లో నాలుగుసార్లు ప్రవేశపెట్టినా, అది ఆమోదానికి నోచుకోలేదు.