13-07-2025 01:13:54 AM
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): గత తొమ్మిదేళ్లలో దేశంలో కొత్త గా 8.5 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రూ. 2 లక్షల ప్యాకేజీతో యువత సాధికారత కోసం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 11 ఏళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో వస్తున్న మార్పులకు, యువత శక్తి, సామర్థ్యాలు తోడవు తున్నాయన్నారు.
బోయిగూడ, రైల్ కళారంగ్‌లో జరిగిన రోజ్ గార్ మేళా కార్యక్ర మంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన అందచేశారు. ఈ సందర్భం గా కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ యువత ఉద్యోగాల కోసం వేచి చూసే పాత పద్ధతికి స్వస్తి పలికి.. స్టార్టప్స్, స్కిల్లింగ్ ద్వారా సాధికారత కల్పిస్తూ ఓ బలమైన వ్యవస్థను నిర్మిం చే దిశగా ప్రధాని పనిచేస్తున్నారని తెలిపా రు.
ఫలితంగా 2017 నుంచి 8.5 కోట్ల మందికి కొత్త ఉద్యోగాలొచ్చాయని, ఈపీఎఫ్‌ఓ లెక్కలు ఈ వివరాలను వెల్లడిస్తు న్నాయన్నారు. 2020 నుంచి 3.5 కోట్లకు పైగా యువత, 18 నుంచి 28 ఏళ్ల లోపు వారు ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ అయ్యారని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలోనే 1.13 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓలో చేరారని అన్నారు.
స్టార్టప్స్ ద్వారా 17.6 లక్షల మందికి ఉపాధి
స్టార్టప్ ఇండియా ద్వారా యువతను ఉద్యోగ కల్పన కోసం ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా 1.60 లక్షలకు పైగా స్టార్టప్స్ దేశంలో ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా 11 ఏళ్లలో 17.6 లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. ప్రధాని మోదీ స్వప్నమైన వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో యువత పాత్ర కీలకమన్నారు.
ఇప్పటివరకు జరిగిన 15 విడతల రోజ్ గార్ మేళాలో దేశవ్యాప్తంగా 10.50 లక్షల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. తాజాగా ప్రస్తుత విడతలో మరో 51వేల మందికి అపాయింట్మెంట్ ఇస్తున్నామన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉండటం మన బలమని తెలిపారు. ఈ యువశక్తి సామర్థ్యం కారణంగానే ఇవాళ మనం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామన్నారు.
దేశాభివృద్ధిలో మహిళలు కీలక భాగస్వాములు
11 ఏళ్లుగా దేశాభివృద్ధిలో మహిళలు కీలక భాగస్వాములుగా ఉన్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు ఎక్కువ లబ్ధి చేకూరుతోందన్నారు. ముద్ర యోజనలో భాగంగా రూ.52 వేల కోట్ల రుణాలు అందజేస్తే అందులో 68 శాతం మహిళలే దక్కించుకున్నారని అన్నా రు.
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా 1.6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్ధి జరిగిందని, ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5జీ, డ్రోన్స్, తదితర రంగాలకు సంబంధించి 400 కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 8 ప్రాంతీయ భాషల్లో శిక్షణను అందిస్తున్నామని, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, జవహార్ నవోదయ విద్యాలయాల్లో స్కిల్ హబ్స్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
యువత సాధికారత కోసం..
వచ్చే ఐదేళ్లలో యువతకు సాధికారత కల్పించేందుకు రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజీని మోదీ సర్కారు ప్రకటించిందన్నారు. ఇందులో 20 లక్షలకు పైగా యువతకు సంప్రదాయ చేతివృత్తులతోపాటుగా అధునాతన సాంకేతికతలో శిక్షణ ఇస్తామన్నారు.