calender_icon.png 13 July, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యాక్టరీ ప్రమాదాల పాపమెవరిది?

13-07-2025 01:22:28 AM

ఊపిరి తీస్తున్న ఉపాధి

ఇటీవల సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదం అందరినీ ఆవేదనకు గురిచేసింది. పదుల సంఖ్యలో   కార్మికులు మరణించడం, చాలామంది గాయపడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎంతోమంది మృతులు, బాధిత కుటుంబాల దయనీయ స్థితి.. పొట్టకూటి కోసం, ఉపాధి వేటలో రాష్ట్రాలు దాటుకుని తెలంగాణ వచ్చిన వలస కార్మికులు తిరిగి మృతదేహాలుగా వారి సొంత గ్రామాలకు చేరడం అందరినీ కలిచివేసింది.

ఉపాధి కోసం వస్తే ఊపిరిలేకుండా పోవడంతో వారి కుటుంబాలు దిక్కుతోచనిస్థితిలో రోడ్డునపడ్డాయి. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన వారికి జరిగిన అన్యాయంపై ఎవరినీ అడగాలో తెలియని హృదయ విదారక స్థితి. సొంతవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లే పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ అన్న చందాన పారిశ్రామిక ప్రమాదాలకూ అనేక కారణాలున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం ఒకవైపు.. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం మరోవైపు.. వెరసి పారిశ్రామిక ప్రమాదాల్లో అమాయక కార్మికులు బలవుతున్నారు. మరి పారిశ్రామిక ప్రమాదాల పాపం ఎవరిది?

  1. బాధితుల్లో ఎక్కువమంది వలస కార్మికులే
  2. కంపెనీల నిర్లక్ష్యం.. పట్టించుకోని ప్రభుత్వం
  3. పరిహారం పేరిట చేతులు దులుపుకుంటున్న వైనం
  4. ప్రమాదాల నివారణపై కమిటీలతో కాలయాపన

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : పాశమైలారంలోని సిగాచి కంపె నీలో జరిగిన ప్రమాదంలో 44 మంది మరణించారు. చికిత్స పొందుతున్న వారి లో కొందరు ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నా రు. ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. రాహుల్, శివాజీ, వెంకటేశ్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ తక్షణ సహా యం కింద రూ. 15 లక్షల చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. ఈ 8 మంది కార్మికులు ప్రమాదంలో పూర్తిగా కాలిపోయి ఉంటారని, వారి అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలని మృతుల కుటుంబాలకు తెలిపారు. ఆచూకీకి సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే చెబుతామని, అప్పటివరకు బాధిత కుటుంబాలు స్వస్థలాలకు వెళ్లిపోవాలని, మూడునెలల తర్వాత తిరిగి రావా లని అధికారులు సూచించారు.

వాస్తవాని కి ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి, గాయపడిన వారికి రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అయితే మరణించిన, గాయపడిన కార్మికుల కుటుంబాలకు పరిహారం అందలేదు. కానీ ఆచూకీ తెలియని వారి కుటుంబాలకు మాత్రం కేవలం రూ.15లక్షల పరిహారం ఇచ్చి యాజమాన్యం చేతులు దులుపుకున్నది.

బాధిత కుటుంబాలు మాత్రం మృత దేహాలను కూడా కడసారి చూసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సిగా చి ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదం కొత్తదేమీ కాదు. గతంలో జరిగిన అనేక ప్రమాదాల తీరుతెన్నులు ఇలాగే ఉన్నాయి. 

ప్రభుత్వ పర్యవేక్షణ లోపం..

కార్మిక శాఖ తరఫున 2020 నుంచి ఇప్పటివరకు 7,389 తనిఖీలు, 3,569 సంయుక్త తనిఖీలు నిర్వహించినట్లుగా కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కార్మిక శాఖ చేసిన తనిఖీల్లో బిల్డింగ్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల్లో కేవలం 596 తనిఖీలు జరిగాయి. అయితే నిరంతరం తనిఖీలు చేసేందుకు సరిపడా సిబ్బంది లేరని కార్మిక శాఖ అధికా రులు చెబుతున్నారు.

కార్మిక శాఖ, ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్‌గానీ తనిఖీలు చేసి, ఆ ఇన్‌స్పెక్షన్ రిపోర్టులు కంపెనీలకు ఇచ్చినప్పుడు లోపాలు సవరించుకోవాల్సిన బాధ్యత కంపెనీ లేదా పరిశ్రమల యాజమాన్యాలపై ఉంటుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ఫార్మా రంగంలో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో సిగాచి ఇండస్ట్రీస్ ప్రమాదం కూడా ఒకటి. ఈ ప్రమాదం తర్వాత పరిశ్రమల్లో భద్రతా లోపాలు బయటపడ్డాయి.

పరిశ్రమలపై అజమాయిషీకి ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి తదితర ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. కానీ ఆయా శాఖల తరపున జరిగే తనిఖీలు మొక్కుబడిగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తనిఖీలు చేసి ఏయే లోపాలున్నాయనే విషయంపై కంపెనీలను అప్రమత్తం చేసినా తదుపరి వాటిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిశ్రమలు కూడా లోపాలను సరిదిద్దడంపై దృష్టి సారించడం లేదు.

అలా జరగకపోవడమే ప్రమాదాలకు కారణమవుతోంది. పూర్తి స్థాయిలో టెక్నికల్ సైంటిఫిక్ బోర్డును ఏర్పాటు చేసి దానికి తనిఖీల బాధ్యత అప్పగించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

కమిటీలతో కాలయాపన..

ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం కంపెనీలు ప్రతి రెండు వేల మంది కార్మికులకు ఒక సేఫ్టీ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. కార్మికుల సంఖ్యను బట్టి అదనపు సేఫ్టీ అధికారుల నియామకం జరగాలి. కానీ సేఫ్టీ అధికారులను నియమించుకోవాలనే నిబంధన కాగితాలకే పరిమితం అవుతోంది. చా లావరకు పరిశ్రమల్లో సేఫ్టీ ఆఫీసర్స్ ఉండ టం లేదు. సేఫ్టీ ఆడిట్లు సరిగా జరగడం లేదు తాజాగా ప్రమాదాలతో బహిర్గతమవుతున్నది.

పెద్ద పరిశ్రమలు రెండు సంవత్స రాలకోసారి, చిన్న తరహా పరిశ్రమలు ఏడాదికోసారి లీక్ డిటెక్షన్ అండ్ రిపేర్ పరీక్షలు నిర్వహించాలి. అయితే ప్రభుత్వం, సంబంధిత శాఖల పర్యవేక్షణ లోపించడం కార ణంగా పరిశ్రమల యాజమాన్యాలు కూడా నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. ప్రభుత్వం కూడా ప్రమా దం జరిగినప్పుడే హడావుడిగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తున్నది.

ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అనేక పారిశ్రామిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఎంతో మంది అమాయకులు బలి అయ్యారు. ఇ లాంటి కమిటీలు, దర్యాప్తులు ఎన్నో జరిగాయి. కానీ ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పు డు పర్యవేక్షణే కీలక పాత్ర పోషిస్తుంది. ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు గుర్తించాల్సిన అవసరం ఉంది.

అందుకే కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా పరిశ్రమల నిర్వహణపై ప్రభుత్వం, ఆయా సంబంధిత శాఖ తరచూ తనిఖీలు, నిరంతరం పర్యవేక్షిస్తే లోపాలను సవరించడంతోపాటు ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుందని నిపు ణులు సూచిస్తున్నారు. 

ప్రమాదకర పరిస్థితుల్లో..

తెలంగాణ లేబర్ బ్యూరో రిపోర్ట్ 2023 ప్రకారం 603 పరిశ్రమల్లో దాదా పు 5వేల మంది ప్రమాదకర పనుల్లో ఉన్నారని స్పష్టమవుతోంది. ఇటీవల ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన తనిఖీల్లో కంపెనీల్లోని ప్రమాదకర ప్రదేశా ల్లోనూ రోజువారీ కూలీలను నియమించుకుని పనులు చేయిస్తున్నట్లుగా తేలిం ది. పరిశ్రమలను కాలుష్య స్థాయిలను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ కేటగిరీలుగా విభజిస్తారు.

రెడ్ కేటగిరీ కింద గుర్తించిన పరి శ్రమల్లో కాలుష్య స్థాయితోపాటు ప్రమాద అవకాశాలు ఎక్కువగా ఉంటా యి. ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువున్న ప్రాంతాలలోనూ ఎలాంటి అనుభవం లేని రోజువారీ కూలీలతో యాజమాన్యాలు పనులు చేయిస్తున్నట్లు అధికారు లు గుర్తించారు. రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో ని కీలకమైన ప్రదేశాల్లో పర్మినెంట్ లేదా శిక్షణ పొందిన కార్మికులే ఉండాలి. కానీ చాలా కంపెనీల్లో ఈ నిబంధనలను అమలు చేయడం లేదు.

తెలంగాణలో ఏటా సగటున 180 వరకు తీవ్ర పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నట్లు ఫ్యాక్ట రీస్ డిపార్ట్‌మెంట్ లెక్కలను బట్టి తెలుస్తోంది. ఈ మేరకు 2014 నుంచి 2021 మధ్య 1,270 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 456 మంది చనిపోయారు. 537 మంది గాయపడ్డారు. ముఖ్యంగా నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు.

బలవుతున్న వారిలో వలస కార్మికులే అధికం..

తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 19,580 పరిశ్రమలు రిజిష్టర్ కాగా వీటిలో దాదాపు 6.94 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే దాదాపు రెండు లక్షల మంది వలస కార్మికులు ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్నారని పలు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో ముఖ్యంగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులే అధికంగా ఉన్నారు.

కంపెనీలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ప్రమాదకర ప్రదేశాల్లో వలస కార్మికులతో పనిచేయిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ముందుగా వలస కార్మికులే ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ప్రమాదాలు చోటుచేసుకున్న సందర్భంలోనూ బాధితులు స్థానికులు కాకపోవడంతో ప్రభుత్వం వైపు నుంచి ఆశించిన భరోసా అందక వలస కార్మికులను యాజమాన్యాలు కూడా పట్టించుకోవడం లేదు.

ప్రమాదం జరిగినప్పుడే సహాయక చర్యలు, పరిహారం ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పారిశ్రామికాభివృద్ధిలో వలస కార్మికుల పాత్ర కూడా ఉన్న నేపథ్యంలో తమను కూడా ప్రభుత్వం తగిన విధంగా సహకరించాలని వారు కోరుతున్నారు.