calender_icon.png 13 July, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందని ఇంధనం

13-07-2025 01:31:29 AM

  1. ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోయాయి
  2. కుట్ర కోణం.. పక్షి ఢీకొట్టిన ఆనవాళ్లు లేవు
  3. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక
  4. తుది నివేదిక వచ్చే వరకు వేచిచూద్దాం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

న్యూఢిల్లీ, జూలై 12: అహ్మదాబాద్ ఎయిరిండి యా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్‌క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) శనివా రం ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయ్యాక సెకన్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోయినట్లు తన నివేదికలో వెల్లడించింది. 15 పేజీలతో కూడిన నివేదికలో కాక్‌పిట్‌లో రికార్డున పైలట్ల సంభాషణ సహా ఇతర వివరాలను ఏఏఐబీ వెల్లడించింది.

ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆఫ్ కావడంపై.. ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్.. మరో పైలట్‌ను ప్రశ్నించినట్టు రిపోర్టులో ఉంది. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత పైలట్లు మేడేకాల్ ఇచ్చారని ఏఏఐబీ వెల్లడించింది. రెండు ఇంజిన్లు ఒక సెకను తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు నివేదికలో పేర్కొంది. ప్రమా దానికి ముందు విమానం కేవలం 32 సెకన్ల పాటు గాల్లో ఉన్నట్టు వెల్లడించింది.

రన్‌వేకు కేవలం 0.9 నాటికల్ మైళ్ల దూరంలోని ఒక హాస్టల్ భవంతిపై విమానం కూలిపోయిందని నివేదిక వివరించింది. ఇంజిన్లు శక్తిని కోల్పోయిన తర్వాత ర్యామ్ ఎయిర్ టర్బైన్‌ను యాక్టివేట్ చేసినట్టు గుర్తించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది.

ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమి లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. విమానంలో ఇంధనం కూడా స్వచ్ఛంగానే ఉందని, కలుషితమైన ఆనవాళ్లు లేవని తెలిపింది. ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కో ణం లేదని, పక్షి ఢీకొన్న ఆనవాళ్లు కూడా కన్పించలేదని ప్రాథమికంగా నిర్థారించారు.

ఏఏఐబీ సమర్పించిన ప్రాథమిక నివేదికపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. విమాన ప్ర మాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని, తుది నివేదిక వచ్చే వరకు వేచి చూ డాలని సూచించారు. జూన్ 12న ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లుటైలో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మందికి మృతి చెందిన విషయం తెలిసిందే. 

ప్రమాదం వెనుక విద్రోహ చర్య లేదు

విమాన ప్రమాదం వెనుక ఎలాంటి విద్రోహ చర్యలు లేవని ఏఏఐబీ తమ నివేదికలో పేర్కొంది. ‘విమానం ప్రయాణించిన మార్గానికి సమీపంగా పక్షులు ఎగరలేదు. పక్షి ఢీకొన్న ఆనవాళ్లను కూడా ఏం లేవు. ఘటనలో ఎలాంటి కుట్ర కోణం కూడా జరగలేదు. దీంతో ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉండే అవకాశముందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాల్లేవని తెలిపింది.

నివేదికపై తొందరపాటు వద్దు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పందించారు. విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని, తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రతి భ కలిగిన పైలట్లు, సిబ్బంది మన దగ్గర ఉన్నారు. వారు పౌర విమానయానానికి వెన్నుముక వంటివారు. ఎలాంటి నిర్ధారణ లేకుండా ఒక నిర్ణయానికి రాలేము. తుది నివేదిక కోసం వేచి చూద్దాం. ఈ కేసులో ఎన్నో టెక్నికల్ అంశాలు ముడిపడి ఉన్నాయి’ అని తెలిపారు.

నివేదికను తప్పుబట్టిన ఏఎల్‌పీఏ

విమాన ప్రమాదంపై ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై ఏఎల్‌పీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ జరిగిన తీరు, నివేదికలో వెల్లడించిన వివరాల విధానం చూస్తే పైలట్లదే తప్పిదమనే అర్థం వచ్చేలా ఉందని పేర్కొంది. నిపుణులైన లైన్ పైలట్లు లేకుండా దర్యాప్తు ఎలా చేస్తారని ప్రశ్నించింది.

నివేదికలో ముఖ్యాంశాలు..

1) విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత క్షణాల్లోనే రెండు ఇంజిన్లు షట్‌డౌన్ అయ్యాయి. ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్‌లు.. రన్ నుంచి కటాఫ్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. ఇది కేవలం సెకన్ల వ్యవధిలో జరిగింది. ఆ తర్వాత విమాన ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. 

2) ప్రమాద సమయంలో థ్రస్ట్ లివర్లు పనిచేయనట్లుగా అనిపించాయి. కానీ బ్లాక్‌బాక్స్ డేటాను పరిశీలిస్తే థ్రస్ట్ పని చేసేందుకు ప్రయత్నించినట్టు కన్పించింది. దీన్నిబట్టి చూస్తే సాంకేతిక వైఫల్యం ఉన్నట్లే అనిపిస్తోంది.

3) టేకాఫ్‌కు ఫ్లాప్ సెట్టింగ్, గేర్ సాధారణంగానే పని చేశాయి. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఆకాశం స్పష్టంగా కనిపించింది. పక్షి ఢీకొట్టడం లాంటివి ఏం జరగలేదు.

4) ఎయిరిండియా పైలట్లు ఇద్దరూ మెడికల్‌గా ఫిట్‌గానే ఉన్నారు. ఇలాంటి విమానాలు గతంలో నడిపిన అనుభవం ఇద్దరికి ఉంది.

5) గతంలో ఈ విమానంలోని ఇంధన కంట్రోల్ స్విచ్‌ల్లో సమస్య వచ్చిన సందర్భాలు లేవు.

6) విమానంపై ఎలాంటి కుట్రకోణం జరగలేదు. దాడి జరిగినట్టు ఆధారాలు లేవు. ఫ్యూయల్ స్విచ్‌లో లోపాలు ఉన్నట్లు ఎఫ్‌ఏఏ అడ్వైజరీ ద్వారా తెలుస్తోంది.

7) నివాస సముదాయాల మధ్యలో ఈ ప్రమాదం సంభవించింది. పలు భవనాలను విమానం ఢీకొట్టింది. దీంతో ఇంజిన్, ల్యాండింగ్ గేర్‌తో పాటు విమాన శిథిలాలు దాదాపు 1000 అడుగుల విస్తీర్ణంలో చెల్లాచెదురయ్యాయి.