calender_icon.png 13 July, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందేళ్ల ఆకాంక్ష నెరవేర్చాం!

13-07-2025 01:17:28 AM

  1. రాహుల్ మాట ఇస్తే దాన్ని నెరవేర్చే బాధ్యత నాది
  2. బీసీలు నాకు తోడుగా ఉండాలి.. రిజర్వేషన్లు కాపాడుకోవాలి
  3. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లేవారిని సామాజిక బహిష్కరణ చేయాలి
  4. బీసీ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): ‘బీసీలకు 42 శాతం రిజర్వేష న్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను.. బీసీలు తనకు తోడుగా, రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోవాలి’ అని బీసీ ప్రజలు, నాయకులను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. వందేళ్ల బీసీల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని, రాహుల్‌గాంధీ, ఖర్గే నాయక త్వంలోనే ఇది సాధ్యమైందని సీఎం స్పష్టం చేశారు.

నాడు దళితులు, వెనుకబడినవర్గాలకూ రిజర్వేషన్లు కల్పిం చింది కాంగ్రెస్సేనని చెప్పారు. రాహుల్‌గాంధీ మాట తమకు శిలాశాస నమని, ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత తనది, పీసీసీ అధ్యక్షుడిదన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని సీఎం పేర్కొన్నారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చినందుకుగానూ సీఎం రేవంత్‌రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు పలువురు నాయకులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు గొప్ప నిర్ణయమన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు.

కులగణన చేస్తామని రాహుల్‌గాంధీ తన భారత్ జోడో యాత్రలో ఇచ్చిన మాటప్రకారం తాము చేశామన్నారు. కులగణనపై ఎన్నో అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించామని, యేడాదిలో పూర్తి పారదర్శకంగా, పక్కాగా కులగణన పూర్తి చేశామన్నారు. 

ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవం..

ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా ప్రకటించుకున్నామని, అసెంబ్లీతో పాటు అన్ని వర్గాలతో కులగణన పైన చర్చించామని, అందరి అభిప్రాయాలను తీసుకు న్నామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ నాయకులు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే... తెలంగాణ మోడల్‌లో కులగణన చేయాలని దేశమంతా చెబుతున్నారని, కులగణనకు తాము వ్యతిరేకమని బీజేపీ గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తుచేశారు.

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని జంతర్‌మంతర్‌లో నిర్వహించిన ధర్నాకు 16 పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఒత్తిడికి లొంగే కేంద్రం 2026లో చేపట్టే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించిందన్నారు. తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసిందన్నారు. 

సామాజిక బహిష్కరణ చేయాలి

బీసీ రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్ధండులైన న్యాయవాదులను వాదనల కోసం నియమిస్తానన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టిన వాళ్లని, కాగితం పెట్టించిన వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించాలని సూచించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని పేర్కొన్నారు.

అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే నిజమైన విజయమని, 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన అజెండా కావాలన్నారు.  కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ , మంత్రి కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితోపాటు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందరం గణేశ్‌చారి, మహాత్మా జ్యోతిబాపూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహఖ అధ్యక్షుడు కుల్క చర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాంకుర్మ తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ కులగణన బెస్ట్ మోడల్

 దేశంలోనే తెలంగాణ కులగణన బెస్ట్ మోడల్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చే నిర్ణయంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ, బీసీ నాయకులు శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కులగణన చాలా పకడ్బందీగా చేశామన్నారు. వ్యక్తులు స్వయంగా తమ వివరాలను డిక్లేర్ చేశారని, కులగణన డేటాను 100 శాతం డిజిటలైజేషన్ చేశామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఎవరూ ఛాలెంజ్ చేయడానికి వీలులేకుండా డేటా భద్రపరిచామని తెలిపారు. 

నన్ను ప్రశ్నించే హక్కు  ప్రతిపక్షాలకు లేదు..

రిజర్వేషన్ల విషయంలో తనను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని సీఎం చెప్పారు. తన నిబద్ధతను ప్రశ్నించలేరన్నారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే ఇంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశామన్నారు.

యాభై శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసిందని, ఈ చట్టం చేసినప్పుడు మంత్రులుగా గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారని చెప్పారు. కేసీఆర్ ఇప్పుడు వాళ్లను తమపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఆ చట్టంలో పేర్కొన్న యాభై శాతం నిబంధనను సవరిస్తూ తామిప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చామని తెలిపారు. 

మోదీ స్థానంలో రాహుల్‌గాంధీ  ఉంటే నేను తెచ్చేవాన్ని..

బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ చేర్చి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య దీని సాధించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. మోదీ స్థానంలో రాహుల్‌గాంధీ ఉంటే 48గంటల్లో  తాను రిజర్వేషన్లను సాధించుకొని వచ్చేవాడినని పేర్కొన్నారు.

ప్రధాని మోదీని తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు ప్రశ్నించాలని కోరారు. బీజేపీ నాయకులు వాళ్ల నిబద్ధతను చూపించాలని, రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా తాను సిద్ధమని, ఏం చేయాలో చెప్పాలన్నారు. కావాలంటే అర్ధరాత్రి కూడా నా మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.