జిల్లాలో నీట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్షను జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆసిఫాబాద్ డి ఎస్ పి అశోక్ లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే నీట్ పరీక్షలు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల- కళాశాల లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని,353 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.
మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులను ఉదయం 11 గంటలకు నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అనుమతించడం జరుగుతుందని, 1.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోనికి అనుమతి ఉండదని తెలిపారు. అభ్యర్థులు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అడ్మిట్ కార్డు, గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని, పరీక్షా కేంద్రంలోనికి మొబైల్ ఫోను అనుమతి లేదని తెలిపారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు సరిపడా కుర్చీలు, టేబుళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అవసరమైన మందు లతో శిబిరం ఏర్పాటు చేయాలని, ఆర్ టి సి అధికారులు సమయానుకూలంగా బస్సులు నడిపించాలని తెలిపారు. పరీక్ష విధులు నిర్వహించే సిబ్బంది తప్ప ఇతరులకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతి లేదని, పరీక్షను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి బందోబస్తు మధ్య పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీట్ పరీక్షల సిట్ సమన్వయకర్త నరసింహస్వామి, పరీక్ష కేంద్రం ముఖ్య పర్యవేక్షకులు, విద్య, వైద్య, విద్యుత్, ఆర్ టి సి, రవాణా, అగ్నిమాపక, శాఖల అధికారులు, తహసిల్దార్ రియాజ్ అలీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






