10 April, 2026 | 1:52 AM

కుక్కల అధికారులు, పాలకవర్గాల నిర్లక్ష్యం

10-04-2026 12:19 AM

ప్రజల ప్రాణాలకు ముప్పున్న పట్టించుకోనీ వైనం!

ధర్మపురి,ఏప్రిల్9 (విజయక్రాంతి): వెల్గటూర్ మండల వ్యాప్తంగా కుక్కల నియంత్రణలో అధికారులు, ఆయా గ్రామాల పాలకవర్గాలు ఫేయిల్ అయ్యారనీ చెప్పకతప్పదు. గ్రామాల్లో పదుల సంఖ్యలో రోగగ్రస్త వీధికుక్కలు స్త్వ్రర విహారం చేస్తున్నప్పటికీ, అధికారులు ఆయా గ్రామంలోని ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రాకపోకల ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.

ప్రజా ఆరోగ్య సంరక్షణ విధానంలో కుక్కల నియంత్రణ అవసరం ఉన్నప్పటికీ అధికారులు గానీ, ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాలు గానీ ఆవిధంగా చర్యలు చేపట్టకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయాన ఏం జరుగుతుందో అనే భయాందోళనలో ప్రజలు తమ జీవనం కొనసాగిస్తున్నారు.

గతంలో మండలంలో కుక్కకాటు వల్ల మరణాలు సైతం సంభవించినప్పటికీ వాటి నియంత్రణను పట్టించుకోకపోవడంపై మండల వ్యాప్తంగా అధికారులు మరియు ఆయా పంచాయతీల పాలకవర్గాలపై ప్రజల తీవ్రఅసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాలు స్పందించి కుక్కల స్త్వ్రర విహారాన్ని నియంత్రించి, తమ ప్రాణాలను సంరక్షించాలని కోరుతున్నారు.

కుక్కల బెడదను నివారించాలి: నూకల కుమార్, జగదేవ్ పేట గ్రామం

కుక్కల బెడదను నివారించాలి. పోయిన సంవత్సరం కుక్కకాటు వలన మా గ్రామంలో ఒక మహిళ చనిపోయింది. ఇంటి నుండి బయటకు రావాలంటే ప్రజలు బయపడుతున్నారు. అధికారులు,పంచాయతీ పాలకవర్గం ఖచ్చితంగా చర్యలు తీసుకుని కుక్కలను నివారించే చర్యలు చేపట్టాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కుక్కల వల్ల భయాoదోళనలు తప్పేలా లేవు. ప్రాణ నష్టం జరగముందే నివారణ చర్యలు చేపట్టి ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించాలి.