calender_icon.png 10 January, 2026 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయలసీమ ప్రాజెక్టును ఎన్జీటీయే ఆపింది

07-01-2026 01:19:13 AM

కృష్ణ-గోదావరి నది జలాలపై వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): 90 శాతం పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎవరూ ఆపలేదని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూన్ (ఎన్జీటీ) ఆపిందని జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలిపారు. 2014 నుంచి 2024 వరకు తెలంగాణ లిఫ్ట్ చేసినదాని కన్నా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని తరలించిందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణా-గోదావరి నదీ జలాల కేటాయింపులపై వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇచ్చారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలిక్ క్లియరెన్స్, ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ లేవని, ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందన్నారు. సరైనా వివరాలు ఇవ్వకపోవడంతోనే కేంద్రం తిప్పి పంపిందని, ఇవ్వాల్సిన టెక్నికల్ డేటా, లీగల్ డేటాను ఇస్తే 45 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి వస్తుంద ని పేర్కొన్నారు.

మిగతా 45 టీఎంసీల కోసం ట్రిబ్యునల్‌లో గట్టిగా వాదనలు వనిపిస్తే అనుమతులొస్తాయని, 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని, కానీ, నీటి కేటాయింపులు మాత్రం చేయలేదని వివరించారు. 2015లో ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణ నది జలాల ఒప్పందం కుదిరిందని, బచావత్ ట్రిబ్యునల్ 299 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చిందని, దానికే గత ప్రభుత్వం సంతకం పెట్టీ ఒప్పుకుందన్నారు.

56 ఏళ్లుగా తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని విమర్శించారు. 299 టీఎంసీలకు సంబంధించి ఏడాదికి మాత్రమే ఒప్పందం చేసుకున్నామని బీఆర్‌ఎస్ అంటోందని, 811 టీఎంసీలలో ఎక్కువ శాతం నీటి వాటాను మనం అడగాలని, మరి బీఆర్‌ఎస్ 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుందని ప్రశ్నించారు. కొత్తగా నీటి కేటాయింపులను కేఆర్‌ఎంబీ చేయదని ఆయన స్పష్టం చేశారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లవి అబద్ధాలు: రాంచందర్‌రావు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లకు ఎంత ఖర్చు పెట్టా రో ప్రజలకు చెప్పాలన్నారు. కేంద్రం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వాటా పంపంకంపై పెద్దన్న పాత్ర పోషిస్తుందని, రాష్ట్రానికి తమ పార్టీ అన్యాయం జరగనివ్వదన్నారు.