జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
- 70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన యూనియన్లో ఉండటం గర్వకారణం
- వృత్తికి కళంకం తెచ్చే కలుపు మొక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- టియూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ
- హక్కుల పరిరక్షణకోసం నిరంతరం పోరాడాలి
- జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి
- రాష్ట్ర కార్యదర్శి రామ్నారాయణ పరుదులు దాటుతున్న జర్నలిజం తీరు
- జర్నలిస్టుల సంక్షేమానికి పాలకులు చొరవచూపాలి
- ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు ఘనంగా టియూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా 3వ మహాసభ
భద్రాద్రి కొత్తగూడెం, మే 24, (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టియూడబ్ల్యూజే (ఐజేయు) నిరంతరం పోరాటాలు సాగిస్తుందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ అన్నారు. టియూడబ్ల్యూజే (ఐజేయు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహాసభ పూర్వ అధ్యక్షులు ఇమ్మంది ఉదయ్ కుమార్ అధ్యక్షతన ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా మృతి చెందిన జర్నలిస్టు మిత్రుల జ్ఞాపకార్థం మౌనం పాటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గలిగిన జర్నలిస్టు యూనియన్ సభ్యులుగా ఉండటం మనందరి అదృష్టమన్నారు. ఆ నాటి నుండి నేటి వరకు యూనియన్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని చెప్పారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం నిరంతరం ప్రభుత్వానికి వినతులు అందిస్తూనే ఉన్నామని, ఉమ్మడి తెలుగు రాష్ట్రం వ్యాప్తంగా ఇప్పటికే 47 వేల అక్రిడేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. సమాజాన్ని జాగృతం చేయాలనే తపన జర్నలిస్టుల మదిలో అనునిత్యం ఉండాలని, అలాంటి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి టియూడబ్ల్యూజే (ఐజేయు) నిత్యం ముందడుగులో ఉంటుందని, వృత్తిలో ఎదురయ్యే ఆటుపోట్లకు జర్నలిస్టులు భయపడకుండా నిజాన్ని నిర్భయంగా బహిర్గతం చేయాలన్నారు.
కత్తిమీద సాములాంటిది ఇ జర్నలిస్టు వృత్తని, అలాంటి జర్నలిస్టులు సమాజ మేలుతో పాటు తమ హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలు చేయాలని టియూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి కే రామ్నారాయణ అన్నారు. అనగారిన వర్గాల గొంతుకగా జర్నలిస్టులు ఉన్నారని, అలాంటి జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డుల కోసం యూనియన్ తొలినాళ్ల నుండి రాజీలేని పోరాటం సాగిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతీ జర్నలిస్టులకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డితో కలిసి యూనియన్ అధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు వివరించామని, వాటి పరిష్కారానికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లా కార్యవర్గం ప్రతీ మూడునెలలకోసారి సమావేశాలు , సెమినార్లు నిర్వహించుకోవాలని సూచించారు.
ఒకప్పుడు ఎంతో గౌరవప్రథమైన జర్నలిజం వృత్తి ఇప్పుడు పరుదులు దాటుతోందని, తద్వారా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని టియూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా మహాసభకు ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పరుదులు దాటి ప్రవర్తించడం సరైంది కాదన్నారు. వార్త సేకరణ విషయంలో నేడు అనేక సవాళ్లను జర్నలిస్టులు ఎదుర్కోవాల్సి వస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఇబ్బందిగా మారిందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆయా నియోజకవర్గాల ఎంఎల్‌ఎలు సహకరించాలని, రాష్ట్రంలోనే భద్రాద్రి జిల్లా యూనియన్ బలంగా ఎదగాలని ఆకాంక్షించారు.
జర్నలిస్టుల హక్కుల రక్షణకు, సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలి
జర్నలిస్టుల హక్కుల రక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల విధులు, బాధ్యతలు అత్యంత కీలకమైనవని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఫోర్త్ ఎస్టేట్గా జర్నలిస్టులు పోషిస్తున్న పాత్ర అమోఘమైనదని, క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటూ సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు.
అయితే ప్రస్తుత తరుణంలో కొన్ని మీడియా యాజమాన్యాల తీరు మారాల్సిన అవసరం ఉందని, రాత్రింబవళ్లు శ్రమించే జర్నలిస్టులకు వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం, వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ పాల్గొని మాట్లాడారు. అనంతరం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది.






