25 May, 2026 | 1:06 AM

కాంగ్రెస్‌లో కష్టపడినోళ్లకే పదవులు

25-05-2026 12:00 AM
  1. కాంగ్రెస్‌ను నమ్ముకున్న వాళ్ళకు అన్యాయం జరగలేదు
  2. పదేళ్ళు జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఉంటాం
  3. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి..
  4. సుడా చైర్మన్ ప్రమాణస్వీకార సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
  5. సంక్షేమ పథకాలను గ్రామ, గ్రామానికి తీసుకెళ్లాలి : తుమ్మల
  6. ఘనంగా సుడా చైర్మన్ ప్రమాణస్వీకారమహోత్సవం
  7. నగరంలో రెపరెపలాడిన కాంగ్రెస్ జెండా

ఖమ్మం, మే 24(విజయక్రాంతి):  కష్టకాలంలో సైతం అండగా నిలిచిన కార్యకర్తలను ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని, కాంగ్రెస్ పార్టీ కోసం పదేళ్ల పాటు పోరాటం చేసిన ఏ ఒక్క కార్యకర్తలకు అన్యాయం జరగదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పదవులు కచ్చితంగా వస్తాయని ఆయన హామి ఇచ్చారు.  

ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్లో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఖాదర్ బాబాలకు ఆదివారం నిర్వహించిన అభినందన సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్ట రాగమయి, రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ నాయకులకు పదవులు వచ్చినప్పుడు కార్యకర్తలు చూపుతున్న ఆనందం పార్టీపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థల ద్వారా ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేయాలని సూచించిన ఆయన, ప్రజలకు సేవలు అందించేందుకు అవసరమైన సహకారం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పనిసరిగా అందిస్తారని అన్నారు. 2014 నుంచి 2023 వరకు రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ జెండాను భుజాన వేసుకుని కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలను ప్రభుత్వం ఎప్పటికీ నిర్లక్ష్యం చేయదని స్పష్టం చేశారు. 

 ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అందిస్తూ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షలు జమ చేస్తున్నామని తెలిపారు.  53 లక్షల నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.  ప్రతి సంవత్సరం మహిళలకు 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి 550 బస్సులు కేటాయించినట్లు చెప్పారు.

గ్రామ గ్రామానికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు అందిస్తామని, కార్యకర్తలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన నాయకులకు నేడు సుడా చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులు రావడం సంతోషకరమని అన్నారు. నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తే రాష్ట్ర నాయకత్వం తప్పకుండా గుర్తింపు ఇస్తుందని చెప్పారు. పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ కు పదవి రావడం తనకు వ్యక్తిగతంగా ఆనందంగా ఉందని, ఖమ్మం నగరంతో పాటు పరిసర మండలాల అభివృద్ధికి సుడా ద్వారా మరిన్ని నిధులు తీసుకురావాలని సూచించారు.

ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఖమ్మం అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి అప్పులు ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. డిప్యూటీ సీఎం, మంత్రి, ఖమ్మం ఎంపీ, సుడా చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. సుడా, గ్రంథాలయ చైర్మన్ ప్రమాణస్వీకరమహోత్స కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు చేపట్టిన కాంగ్రెస్ ర్యాలీ అద్భుతంగా సాగింది. ఖమ్మం నగరంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది..

వేలాధి మంది కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ జెండాను చేత బట్టి ర్యాలీ నిర్వహించారు. పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కు అడుగడుగున నిరాజనం పలికారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.