సీపీఎస్ పాత విధానం అమలు చేయాలి
- జూలైలో జన జాగరణ యాత్ర
- ఆగస్ట్ 23న ఛలో హైదరాబాద్
- సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ వెల్లడి
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): సీపీఎస్ ఉద్యోగుల ముఖ్య సమస్యలైన ఈ హెచ్ ఎస్, డీఏ అరియర్స్, పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ తెలిపారు. జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ‘సీపీఎస్ జన జాగరణ యాత్ర’ను చేపట్టాలని ఈ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి సీపీఎస్ ఉద్యోగులని ప్రత్యక్షంగా కలిసి జరుగుతున్న నిర్లక్ష్యాన్ని వివరించనున్నట్లు తెలిపారు.
ఆదివారం సీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 23న సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ఛలో హైదరాబాద్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. 2.6 లక్షల సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులతో జరగబోయే ఈ సభ ద్వారా ప్రభుత్వానికి సీపీఎస్ ఉద్యోగుల ఆకాంక్ష తెలుపుతామని స్పష్టం చేశారు.
అంతేగాకుండా ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతోందని, ఈహెచ్‌ఎస్ రూపకల్పనలో నిర్లక్ష్యం, డీఏ బకాయిల చెల్లింపులో చూపుతున్న పక్షపాతం ఉద్యోగులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. సీపీఎస్ హఠావో ఎంప్లాయ్ బచావో అన్న నినాదంతో తమ హక్కుల సాధనకై, ఇచ్చిన మాట నెరవేర్చే వరకు ఈ పోరాటం ఆగదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్, మ్యాన పవన్, లింగమూర్తి, పోల శ్రీనివాస్, మల్లికార్జున్, రోషన్, బుచ్చన్న తదితర రాష్ట్ర కార్యవర్గం హాజరయ్యింది.






