calender_icon.png 23 July, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చుట్టమే అర్హత!

23-07-2025 01:13:47 AM

పాలకుడు మనోడైతే చట్టం, గిట్టం జాన్తానై!

  1. అడ్డదారిలో హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నిక 
  2. పోటీకే అర్హతలేని వారిని గెలిపించారు 
  3. జగన్‌మోహన్‌రావు గెలిచింది ఒక్క ఓటుతోనే.. 
  4. ఎన్నికల్లో తారుమారు చేసింది మాత్రం 20 ఓట్లు 
  5. సుప్రీంకోర్టు, జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులు బేఖాతరు

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూల కు కూర్చున్నా తిండికి లోటు ఉండదనే సామెత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అవినీతి, అక్రమాలకు సరిగ్గా సరి పోతుంది. పాలకుడు సహకరిస్తే ఎంతటి అవినీతికైనా పాల్పడవచ్చు.. కోట్లాది రూపాయలను వెనుకేసుకోవచ్చని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు నిరూపించారు.

అవినీతికి అవకాశం ఉన్న అన్ని మార్గాలను గత ప్రభుత్వంలోని కీలక నేతలు సద్వినియోగం చేసుకుని కోట్లల్లో ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్టు హెచ్‌సీఏ ఉదంతంతో మరోసారి స్పష్టమవుతోంది. వీలైన చోట ప్రత్యక్షంగా.. వీలుకాని చోట పరోక్షంగా అవినీతికి మార్గం సుగమం చేశారు. అందరూ కలిసి మూకుమ్మడిగా హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావును గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించారు.

తద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతోపాటు క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాల్సిన అనేక మంది క్రీడాకారుల బంగారు భవిష్యత్‌ను తుంచివేశారు. జగన్‌మోహన్‌రావును ముందుంచి పదేళ్లపాటు తెలంగాణ క్రికెట్ వ్యవస్థను వారి గుత్తాధిపత్యంలో కొనసాగించారు.

గ్రామీణ క్రికెట్ అభివృద్ధిని పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంలో చేసి కేవలం అక్రమార్జనే లక్ష్యంగా అవినీతికి పాల్పడ్డారు. తమ చుట్టమైతే చాలు..వారికి ఎలాంటి చట్టాలు అడ్డం కాదు అన్నట్టు వ్యవహరించి, అడ్డదారిలో జగన్‌మోహన్‌రావును హెచ్‌సీఏ అధ్యక్షుడిగా గెలిపించారు. 

వారంలోనే జాబితా మార్పు..

వాస్తవానికి 2023లో హెచ్‌సీఏ ఎన్నికల ముందు సుప్రీంకోర్టు నియమించిన సింగిల్‌మన్ కమిటీ ఎల్.నాగేశ్వరరావు ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులైన వారి జాబితాను సెప్టెంబర్ 30, 2023వ తేదీన సిఫార్సు చేశారు. అది ఆ సమయంలో హెచ్‌సీఏ నో టీసు బోర్డులో, వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచారు. అయితే వారంలోనే ఓటర్ల జాబితాలో అనేక మార్పులు చేస్తూ హెచ్‌సీఏ అక్టోబర్ 7, 2023వ తేదీన మరో జాబితా విడుదల చేసింది.

ఆ తర్వాత రెండు వారాల్లోనే హెచ్‌సీఏ ఎన్నికలు జరిగాయి. నాగేశ్వర్‌రావు ఇచ్చిన జాబితా నుంచి 68 మంది ఓటర్లను హెచ్‌సీఏ మార్చింది. వారికే ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించింది. అయితే హెచ్‌సీఏ మార్చిన జాబితాలోని 68లో 30కిపైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇనిస్టిట్యూషన్లే ఉన్నాయి. వాటిలో 20వరకూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఇనిస్టిట్యూషన్లు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ 20 ఇనిస్టిట్యూషన్ల పేరిట గత పాలకులు ప్రాక్సీ ఓటింగ్‌కు పాల్పడ్డారు.

ఆయా ఇనిస్టిట్యూషన్లకు సంబంధించిన బాధ్యులతో కాకుండా వేరే వ్యక్తులతో ఓటు వేయించారు. వాస్తవానికి సుప్రీంకోర్టు, బీసీసీఐ సిఫార్సుల ప్రకారం అసలు ప్రాక్సీ ఓ టింగే చెల్లదు. కానీ గత ప్రభుత్వ కీలక నేత లు కేటీఆర్, కవిత, హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి అధికారులతో ప్రాక్సీ ఓటింగ్ చే యించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో జగన్‌మోహన్‌రావు అడ్డదారిలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

జగన్‌మోహన్‌రావు పోటీకి అనర్హుడు..

జగన్‌మోహన్‌రావు అనే వ్యక్తికి అసలు క్రికెట్‌తో ఎలాంటి సంబంధం లేదని అనేక రుజువులున్నాయి. అక్టోబర్ 7, 2023వ తేదీన హెచ్‌సీఏ మార్చిన 68 ఇనిస్టిట్యూషన్ ఓటర్ల జాబితాలో జగన్‌మోహన్‌రావు ఒకరుగా ఉన్నారు. అంతకుముందు జగన్ మోహన్‌రావుకు ఏ క్లబ్‌తోనూ సంబంధం లేదు. హెచ్‌సీఏ ఎన్నికల్లో జగన్‌మోహన్‌రా వు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చూపించిన శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు 30 సెప్టెంబర్ 2023 వరకు రాజేంద్రయాదవ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

వారంలోనే శ్రీచక్ర క్లబ్ ప్రధా న కార్యదర్శిగా రాజేంద్రయాదవ్‌ను మార్చి జగన్‌మోహన్‌రావు చేర్చారు. ఈ క్రమంలోనే 20 అక్టోబర్ 2023వ తేదీన నిర్వహిం చిన ఎన్నికల్లో జగన్‌మోహన్‌రావు ఏకంగా అధ్యక్షుడిగా పోటీ చేశారు. వాస్తవానికి హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత రావాలంటే గతంలో జరిగిన సమావేశాల్లో పాల్గొని ఉండాలి. కానీ జగన్‌మోహన్‌రావు శ్రీచక్ర క్లబ్ ప్రధాన కార్యదర్శిగా అయిన రెండు వా రాల్లోనే హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించారు. ఈ మధ్యలో హెచ్‌సీఏ సమావేశమే జరగలేదు. ఈ కారణంగా జగన్‌మోహన్‌రావు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడే కాదు. 

గెలిపించేందుకే జాబితా మార్పు..

జగన్‌మోహన్‌రావుకు గత ప్రభుత్వ పెద్దలకు చుట్టం కావడంతో ఆయన్ను గెలిపిం చేందుకు వారు రంగంలోకి దిగినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ మోహన్‌రావును గెలిపించేందుకే హెచ్‌సీఏ ఓటర్ల జాబితాను మార్పు చేశారు. ఇందులో వారి పాత్ర కీలకంగా ఉంది. వాస్తవానికి జాబితాలో 68 ఇనిస్టిట్యూషన్లు మార్చారు. వాటిలో 30కిపైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇనిస్టిట్యూషన్లే. 30లో 20 వరకు రాష్ట్ర ప్రభు త్వానికి చెందిన ఇనిస్టిట్యూషన్లు ఉన్నాయి.

వీటిలో ఓటు వేయాల్సిన వారితో కాకుండా వేరే వ్యక్తులతో ఓటు చేయించినట్టు ఆధారాలున్నాయి. ఉదాహరణకు టీఎస్‌ఆర్టీసీ క్లబ్ స్థానంలో వాస్తవానికి కే వెంకటనారాయణ ఓటు వేయాలి. కానీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓటు వేశారు. జీహెచ్‌ఎంసీ క్లబ్ స్థానంలో రోనాల్డ్‌రాస్‌తో ఓటు వేయించారు.

ఈ రకం గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 20 ఇనిస్టిట్యూషన్లలోనూ వేరే వ్యక్తులతో ఓటు వేయించా రు. అయితే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రావు 63 ఓట్లు వచ్చాయి. ఆయన ఒకే ఒక్క ఓటు తో గెలుపొందారు. ప్రభుత్వం 20 క్లబ్‌ల పేరిట వారికి కావాల్సిన వ్యక్తులతో ఓట్లు వేయించడం, జగన్‌మోహన్‌రావు ఒక్క ఓటుతో గెలుపొందడం వంటి అంశాలు అనుమానాలకు దారితీస్తున్నాయి. 

పాలకుల ప్రమేయంతోనే..

20 ఇనిస్టిట్యూషన్ల స్థానంలో వేరే వ్యక్తులతో ఓటు వేయించినది స్పష్టమైన క్రమం లో ఆ ఓట్లు కచ్చితంగా జగన్‌మోహన్‌రావుకే పడి ఉంటాయనేది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఆ ఇనిస్టిట్యూషన్లన్నీ ప్రభుత్వం పరిధిలోని పనిచేస్తున్నా యి. ఒకవేళ ఈ 20 ఇనిస్టిట్యూషన్లలో వ్యక్తుల మార్పు, కొన్నింటిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఓట్లు వేయించిన నేప థ్యంలో ఆ ఓట్లు చెల్లకపోతే హెచ్‌సీఏ అధ్యక్షుడి ఎన్నికే చెల్లుబాటు కాదు.

నిబంధనల ప్రకారం హెచ్‌సీఏ ఎన్నికలు రద్దు కావాలి. కానీ అలా జరగలేదు. అంటే అప్పటి ప్రభు త్వ పెద్దలు ఏ స్థాయిలో ప్రలోభపెట్టి జగన్‌మోహన్‌రావును గెలిపించారో అర్థమవు తోంది. అయితే దీనిపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్‌మోహన్‌రా వు గత ప్రభుత్వ కీలకనేతలకు చుట్టమే కాకుండా, గత అసెంబ్లీ ఎన్నికల సమయం లో కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలు కూడా ఉన్నాయని కొందరు ఆరోపిస్తున్నారు.

ఈ కార ణంగానే హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటర్లను డ బ్బు, ఇతర అంశాలతో ప్రలోభపెట్టినట్టు తెలుస్తోంది. దీంతోపాటు జాబితాలో మార్పు, అధికారులతో ఓటింగ్ విషయంలో అప్పటి ఎన్నికల అధికారి సంపత్‌కుమార్‌ను తప్పుదోవ పట్టించి జగన్‌మోహన్‌రావు అడ్డదారిలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారనేది సుస్పష్టం. 

అధికారులకు ఓటు వేసే హక్కే లేదు..

సుప్రీంకోర్టు, జస్టిస్ లోథా కమిటీ సిఫార్సుల మేరకు పరిపాలనతో సంబంధం ఉన్న ఎవరూ హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనకూడదు. నిబంధనల ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఇతర కార్యనిర్వాహక అధికారులు, ఎంపీలు, మంత్రుల వంటి చట్టసభ లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి ప్రమే యం ఉండకూడదు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్ అడ్మినిస్ట్రేటర్లుగా ఉండేందుకు అర్హులు కారని లోథా కమిటీ సిఫార్సు చేసింది.

కానీ హెచ్‌సీఏ ఎన్నికల్లో ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఐఏఎస్, ఐపీఎస్‌ల ఓటింగ్ వెనుక గత పాలకులైన కేటీఆర్, కవిత, హరీశ్‌రావుల హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు.

గతం లో ఎప్పుడూ ఓటు వేయని అధికారులు కేవలం 2023లో జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో మాత్రమే ఎందుకు ఓటు వేశారని ప్ర శ్న ఉత్పన్నమవుతోంది. దీనికి తోడు ఎన్నికల సమయంలో ఓటు వేసిన ఐపీఎస్ అధి కారి సజ్జనర్‌ను ఈ అంశంపై వాకబు చేయ గా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఓటు వేయా ల్సి వచ్చిందని ఒప్పుకున్నట్టు ఆరోపణలున్నాయి. 

జగన్‌మోహన్‌రావు అర్హుడే కాదు: గురువారెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్

హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు అడ్డదారిలో ఎన్నికయ్యారు. ఆయన అసలు ఆ పదవికి అర్హుడే కాదు. జగన్‌మోహన్‌రావుకు క్రికెట్‌తో ఎలాంటి సంబంధమే లేదు. కేవలం వారంలో రోజుల్లోనే శ్రీచక్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనట్టు చూపించి హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా అధికారులతో ఓట్లు వేయించారు. దీని వెనుక కేటీఆర్, కవిత, హరీశ్‌రావు పాత్ర కీలకంగా ఉంది.

హెచ్‌సీఏ ఎన్నికల్లో ప్రాక్సీ ఓటింగ్ చెల్లదని స్పష్టంగా ఉంది. అప్పటి ఎన్నికల అధికారి సంపత్‌కుమార్‌ను గత ప్రభుత్వ పెద్దలు తప్పుదోవ పట్టించారు. జగన్‌మోహన్‌రావు, హెచ్‌సీఏ బోర్డు సభ్యులతోపాటు కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంపత్‌కుమార్‌లను కూడా కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి.

ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కోసం కేటాయించిన ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలి. 

ముగిసిన ‘హెచ్‌సీఏ’ నిందితుల కస్టడీ 

మల్కాజిగిరి కోర్టులో ప్రవేశపెట్టిన సీఐడీ అధికారులు

మేడ్చల్, జూలై 22 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసులో నిందితుల కస్టడీ మంగళ వారం ముగిసింది. అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్, శ్రీచక్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేందర్, అధ్యక్షురాలు కవితను సీఐడీ అధికారులు ఆరు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు. హెచ్‌సఏ లో జరిగిన అక్రమాలపై, అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ఫోర్జరీ సంతకాలు చేసిన వాటిపై విచారించారు.

విచారణలో సీఐడీ అధికారులు అనేక విషయాలు రాబట్టినట్టు తెలిసింది. జగన్మోహన్‌రావు అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి 23 ఇనిస్టిట్యూషనల్ ఓట్లను అక్రమంగా వేయించినట్టు సీఐడీ గుర్తించింది. కస్టడీ గడువు ముగియడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి మల్కాజిగిరి కోర్టులో మంగళవారం ప్రవేశపెట్టారు.

కాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో దుష్ప్ర చారం చేయొద్దని సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా మీడియాకు సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటింగ్ విషయంలో ఐఏఎస్, ఐపీఎస్‌లపై దుష్ప్రచారం చేయొద్దని తెలిపారు. కేసుకు సంబంధించి అన్ని వివరాల ను ఎప్పటికప్పుడు సీఐడీ అధికారికంగా విడుదల చేస్తుందని తెలిపారు.