9 June, 2026 | 2:45 AM

బీజేపీనే ప్రజలు తరిమికొడతారు

09-06-2026 01:37 AM

పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ 

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు రజాకార్ల పాలనతో పోల్చడం అవివేకమని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఇవాళ ఏం మాట్లాడుతుందో ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వం అని బీజేపీ వాళ్లు మాట్లాడటం హాస్యాస్పదమని బండి ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనకు, దేశంలో మోడీ పాలనకు తేడాను ప్రజలు స్పష్టంగా లెక్కలు వేస్తున్నారని, త్వరలోనే బీజేపీ వాళ్లను గ్రామాలకు రాకుండా ప్రజలే తరిమి కొడతారని బండి హెచ్చరించారు. తెలంగాణలోనే కాదు, ఈ దేశంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఆపే దమ్ము బీజేపీకి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేసే 100 శాతం పన్నుల్లో 25 శాతం కూడా తిరిగి రాష్ట్రానికి ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని దమ్ముంటే ప్రశ్నించాలని రాంచందర్ రావుకు బండి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యుల సంక్షేమం కోసం పనిచేస్తే, ప్రజల బాధలను పట్టించుకోకుండా బీజేపీ సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తోందన్నారు.