థాయ్‌లాండ్‌లో కుప్పకూలిన విమానం
24-08-2024 12:00 AM
- ఇద్దరు పైలెట్లు సహా 9మంది మృతి
- బ్యాంకాక్ నుంచి ట్రాట్ ప్రావిన్స్‌కు వెళ్తుండగా ప్రమాదం
న్యూ ఢిల్లీ, ఆగస్టు 23: థాయ్‌లాండ్‌లో గురువారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లతో కలిసి బ్యాంకాక్ నుంచి బయలు దేరిన విమానం బ్యాంగ్ పకాంగ్ జ్లిలాలోని చాచోయెంగాసావో అడవుల్లో కుప్పకూలింది. థాయ్ ఫ్లయింగ్ సర్వీస్ కంపెనీకి చెందిన విమానం గురువారం మధ్యాహ్నం టూరిస్టులతో బ్యాంకాక్ విమానాశ్రయం నుంచి ట్రాట్ ప్రావిన్స్‌కు వెళ్తుండగా మార్గమధ్యలోని బ్యాంగ్ పకాంగ్ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదంలో మొత్తం తొమ్మిదిమంది చనిపోగా.. వారిలో ఐదుగురు చైనాకు చెందినవాళ్లు, మరో ఇద్దరు థాయ్ ప్రయాణికులు సహా పైలెట్, కోపైలెట్ ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.






