21 July, 2026 | 12:09 PM

బాధితుల పక్షాన పోలీసు వ్యవస్థ ఉండాలి

21-07-2026 01:19 AM

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, జూలై 20 : బాధితుల పక్షాన పోలీసు వ్యవస్థ ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమ వారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా 49 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురాగా, ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, బాధితుల సమస్యలపై సత్వరమే దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందని, ప్రజలకు న్యాయం అందించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా, జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం ఉన్నా 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది వామన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.