శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
హనుమకొండ, జూలై 01 (విజయక్రాంతి): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజలందరి సహకారం ఎంతో అవసరమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ రోజు ఉదయం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన సీపీకి సాయుధ పోలీసులు నూతన కమిషనర్ కు వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఛాంబర్ లో బదిలీ పై వెళ్ళుతున్న పూర్వ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ నుండి నూతన పోలీస్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, నోట్బుక్లను సీపీకి అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తారని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా పోలీసింగ్ను సమర్థవంతంగా నిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.






