2 July, 2026 | 3:25 AM

ఏజెన్సీ ప్రాంతానికి అదనంగా 2000 ఇండ్లు మంజూరు చేయండి..

02-07-2026 02:29 AM

గృహ నిర్మాణ శాఖ మంత్రి కి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ల విన్నపం

ఉట్నూర్, జులై 1( విజయక్రాంతి): రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలకు రెండో విడత లో అదనంగా 2వేల ఇందిరమ్మ ఇళ్లను మం జూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సీతక్క, వెడ్మ బొజ్జు పటేల్, ఆదివాసి ఎమ్మెల్యేల విజ్ఞప్తి చేశారు. బుధవారం రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహని ర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మంత్రి శ్రీమతి సీతక్క,నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ ఇల్లందు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య,భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకటరావు సంయుక్తంగా వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో ఐటీడీఏ (ITDA) పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు అదనపు ఇళ్లను కేటాయించడం ద్వారా ఆదివాసి గిరిజన కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ అధిక సంఖ్యలో ఆదివాసి కుటుంబాలు పూరి గుడిసెల్లో, తాత్కాలిక నివాసాల్లోనే జీవనం సాగిస్తున్నాయని, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా శాశ్వత గృహాలను నిర్మించుకోలేకపోతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కూడా ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించి, అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కోరారు.ఆదివాసి గిరిజన కుటుంబాల గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.