ప్రధాని పొదుపు మంత్రం!
మన దేశ ప్రధానమంత్రి చేసే ప్రసంగాల ప్రభావం యావత్ దేశంపైనా, 140 కోట్ల ప్రజలపైనా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసే ప్రసంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. 2016లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన, 2020లో కరోనా సంక్షోభం వేళ జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత లాక్‌డౌన్ విధిస్తున్నట్టు చెప్పడాన్ని దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. హైదరాబాద్ వేదికగా నిన్న ప్రధాని ‘పొదుపు మంత్రం’ పఠించడం సరిగ్గా జాతినుద్దేశించి చేసే ప్రసంగాన్ని తలపించింది.
సాధారణంగా పార్టీ సభలు, సమావేశాల్లో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించే మోదీ, అందుకు విరుద్ధంగా దేశ ప్రజలకు సూచనలివ్వడంతో మరోసారి ఏదైనా ‘తీవ్ర నిర్ణయం’ ఉంటుందేమోనన్న ఆందోళనలో షేర్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. ము ఖ్యంగా ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దన్న సూచనలతో స్వర్ణాభరణాల కంపెనీల షేర్లు 6-8 శాతం వరకు పడిపోవడం గమనార్హం.
మరోవైపు ఇంధన పొదుపు పాటించాలని కూడా ప్రధాని చెప్పిన నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద బారులుతీరకుండా ఉండేందుకు దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాల్సి వచ్చింది. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని చేసిన ప్రసంగంగానే దీన్ని చూడాలి. వాస్తవానికి మన దేశ చమురు అవసరాల్లో సుమారు 85 శాతం వరకు దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.
భారతీయులు పసిడి ప్రియులు కావడంతో ఏటా 700-800 టన్నుల వరకు బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం దృష్ట్యా దేశ ఎగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడిందనే చెప్పాలి. కానీ, అదే సమయంలో దేశ ఆర్థిక చోధక శక్తి అయిన ఇంధన అవసరాల కోసం చమురును దిగుమతి చేసుకోక తప్పడం లేదు. ఇటు బంగారం, అటు చమురు కొనుగోళ్ల కోసం డాలర్లలో చెల్లింపులు చేయాల్సి రావడంతో భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతకంతకు కరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని ఈ రకంగా సూచనలు ఇచ్చారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రధాని పొదుపు మంత్రం పఠించడాన్ని ప్రతిపక్షాలు ఆర్థిక వైఫల్యానికి నిదర్శనంగా చెప్పుకొచ్చాయి. రాజకీయపరమైన విమర్శలు ఎలా ఉన్నా, దేశ ప్రయోజనాల దృష్ట్యా పొదుపు చర్యలు పాటించడం అవసరమేనని చెప్పవచ్చు.






