వరంగల్ జయముఖి కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
కూకట్ పల్లి, జులై 13 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేటలోని జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ అండ్ సైన్సెస్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో కళాశాలలో విద్యార్థులకు సకాలంలో పరీక్షలు నిర్వహించడం లేదని, నిర్వహించిన పరీక్షల ఫలితాలు ప్రకటించడం లేదని విద్యార్థులు వివిధ విద్యార్థి సంఘ నాయకులు కూకట్పల్లి జేఎన్టీయూహెచ్ రెక్టార్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు.
ఇట్టి విషయంలో జేఎన్టీయూ అధికారులు కలగజేసుకొని విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కళాశాల యజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని సమయానికి పరీక్షలు నిర్వహించడం లేదన్నారు.
దీనివల్ల విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగాలు, స్కాలర్షిప్పులు, పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జయముకి కళాశాల యజమాన్యం పెండింగ్ లో ఉన్న అన్ని పరీక్షలను వెంటనే నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న పరీక్ష ఫలితాలు అన్నిటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా జేఎన్ టి యూ తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జే ఎఎన్ టి యూ జేఏసీ చైర్మన్ బొట్ల బిక్షపతి, ప్రెసిడెంట్ బల్గర్ సందీప్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు మేకల నరేందర్, బిసి విద్యార్థి సంఘ నాయకుడు బోడ మణిధర్, చందు, శ్రీకాంత్, జయముఖి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.






