ఫుట్‌పాత్‌పై కబ్జా దందా..!
- డబ్బాలు పెట్టి దర్జాగా కిరాయిల వసూళ్లు
- ఒక్కో డబ్బాకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు
- ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలు కొందరి ఆదాయ వనరులుగా మారాయంటున్న స్థానికులు
గద్వాల టౌన్, ఆగస్టు 31 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఫుట్పాత్లు, మున్సిపాలిటీకి చెందిన ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల రాకపోకలు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కొందరు ఆక్రమించి రేకుల డబ్బాలు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిని చిరు వ్యాపారులకు అద్దెకు ఇచ్చి నెలనెలా భారీగా కిరాయిలు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
జిల్లా కలెక్టరేట్ సమీపంలోని మున్సిపాలిటీకి చెందిన విలువైన స్థలంలో రేకుల డబ్బాలు ఏర్పాటు చేసి అద్దెలకు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో డబ్బాకు నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు కిరాయి వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఉపాధి కోసం పట్టణానికి వచ్చే చిరు వ్యాపారులు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక అద్దెలు చెల్లిస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫుట్‌పాత్‌లు ఆక్రమణ.. పాదచారులకు అవస్థలు
ఫుట్పాత్లు, రహదారుల పక్కన ఉన్న ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురవుతుండటంతో ప్రజలకు నడిచేందుకు కూడా స్థలం లేకుండా పోతోందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాదచారులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాన రహదారిపైనే నడవాల్సి వస్తోంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాహనాల రాకపోకలకు కూడా ఆటంకం ఏర్పడుతోందని చెబుతున్నారు.
తొలగింపులు కొన్ని ప్రాంతాలకే పరిమితమా?
ఇటీవల కృష్ణవేణి చౌరస్తా, భీంనగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అక్రమ డబ్బాలను మున్సిపల్ అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. అయితే, మెల్లచెరువు చౌరస్తా, రైల్వే స్టేషన్ పరిసరాలతో పాటు పట్టణంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి ఆక్రమణలు కొనసాగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చర్యలు తీసుకుని, మిగిలిన చోట్ల ఆక్రమణలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ, మున్సిపల్ స్థలాలను ఆక్రమించి డబ్బాలు ఏర్పాటు చేసి వాటిని కిరాయికి ఇస్తున్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కబ్జాదారులకు కిరాయిలు.. చిరు వ్యాపారులకు కష్టాలు
ప్రభుత్వ స్థలాలపై అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బాల ద్వారా కొందరు నెలనెలా కిరాయిల రూపంలో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఒకవైపు ఉండగా, మరోవైపు చిరు వ్యాపారులు అధిక అద్దెల భారంతో ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు అంటున్నారు. కబ్జాదారులకు నెలనెలా కిరాయిలు.. చిరు వ్యాపారులకు మాత్రం రోజురోజుకూ కష్టాలు అన్నట్లుగా పట్టణంలో పరిస్థితి మారిందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
పట్టణంలోని ఫుట్పాత్ ఆక్రమణలు, అక్రమ డబ్బాలపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర సర్వే నిర్వహించాలని, ప్రభుత్వ స్థలాలను ప్రజల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని గద్వాల ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై గద్వాల మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక తీర్మానం చేసి, ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.






