‘విమోచన’ను అధికారికంగా నిర్వహించాలి
-విమోచన దినోత్సవాలను జరపటంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ విఫలం
-రజాకార్లకు వారసులుగా ఆ పార్టీల నేతలు
-సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ
-బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు
చిట్యాల, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా జరపాల ని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు.మంగళవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణలో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన ఉద్యమకారులకు, అమరులైన వారి కుటుంబ సభ్యుల కు నిర్వహించిన సన్మాన సభకు ఆయన హాజరై మాట్లాడారు.
ఆనాడు నైజాం ప్రాంతాన్ని పాలించిన రజాకార్లు తెలంగాణ ప్రాంత ప్రజలను హింసించి అత్యాచారాలు, హ త్యలు చేశారని వారి అరాచకాలకు సజీవ నిదర్శనంగా గుండ్రాంపల్లి గ్రామం నిలిచిందన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల మాన ప్రాణాలను దోచుకున్న రజాకార్లకు వారసులుగా నేడు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తింపు పొందారన్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చామని ఒకరు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి రాష్ట్రాన్ని ఇచ్చింది తాము అని మరొ కరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రామచంద్రరావు అన్నారు.
తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో ఎన్నో ప్రగల్భాలు పలికిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కేవలం 10 శాతం ఓట్లు ఉన్న ముస్లింలకు దాసోహం అంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పక్కన పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికా రికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడి అమరులైన ఎంతోమంది పోరాట యోధులను కనీసం స్మరించుకోవడం కూడా పాలక ప్రభుత్వాలకు చేతకాకుండా పోయిందన్నారు.
తెలంగాణ రాష్ర్ట సాధనలో రజాకా ర్లకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన పో రాట యోధులను స్మరించుకోవడం తెలంగాణ ప్రాంత ప్రజల కనీస ధర్మమని వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో బీజేపీఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవం లో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారని తెలిపారు.
అనంతరం ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలను తెగించి పోరాడిన ఉద్యమకారులకు ప్రాణాలు, కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాచం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, పాతూరి కరుణ, మొగులయ్య, జిల్లా కార్యదర్శి మైలా నరసింహ, మండల అధ్యక్షుడు పీక వెంకన్న, దళిత మోర్చా రాష్ర్ట నాయకులు మాస శ్రీనివాస్, గుండాల నరేష్ గౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.






