calender_icon.png 30 October, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలన పడకేసింది

30-10-2025 12:51:05 AM

  1. రిజర్వేషన్ల పేరుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది
  2. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలి
  3. అప్పుడే వారిచ్చిన హామీలు అమలవుతాయి
  4. మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): రాష్ర్టంలో పాలన పడకేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం, మంత్రుల తీరుపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. రాష్ర్టంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, రైతులు పండించిన ధాన్యం, పత్తి కొనుగోలు చేసే పరిస్థితే లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

సన్న ధాన్యానికి బోనస్, రైతులకు పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు కూడా అందడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఎరువుల కోసం క్యూలో నిలబడి రైతు చనిపోయిన దుస్థితి రాష్ర్టంలో నెలకొందని వాపోయారు. రూ.73 వేల కోట్లు రైతుబంధు రూపంలో అన్నదాతల ఖాతాల్లో జమచేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదైతే.. ఆ రైతుల గోస పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అటు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను కూడా రేవంత్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. మొత్తం మీద ఇప్పటివరకు ఇచ్చినవి ఏడు వేల ఉద్యోగాలు కూడా లేవ ని ఎద్దేవాచేశారు. దీనిపై మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని, కానీ వారు కూడా ఒకరికి ఒకరు పొంతన లేని నంబర్లు చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు. యువతుల కు స్కూటీ, మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మాట తప్పిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఫ్రీ బస్‌పేరు చెప్పి ఆ డబ్బులు పురుషుల నుంచి లాక్కుంటున్నారని ఆరోపించారు. పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్.. ఆ ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క ఇల్లు కూడా కట్టకపోగా.. వేల ఇళ్లను నేలమట్టం చేసిందని మండిపడ్డారు. పెద్దల ఇండ్ల జోలికి వెళ్లని హైడ్రా.. పేదల ఇల్లు కనిపిస్తే కూల్చివేస్తోందంటూ ఆగ్రహించారు. మంత్రులు జూబ్లీహిల్స్‌లో గల్లీ లీడర్లలా తిరుగుతూ పాలనను పక్కన పెట్టేశారని ఫైరయ్యారు.

మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే

మున్నూరు కాపులకు సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్ పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ బీసీలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేస్తేనే ఇది జరుగుతుందని తాము ముందే చెప్పినా ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. కనీసం ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలనైనా అమలు చేయాలని హితవుపలికారు.

బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడెందుకు ఇవ్వట్లేదో చెప్పాలని నిలదీశారు. బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని డిమాండ్‌చేశారు. ఇక ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబితేనే వారిచ్చిన హామీలు అమలవుతాయని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ను గెలిపించి కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు.

రెండేళ్ల కిందట ఇలాంటి హామీలనే నమ్మి ప్రజలు మోసపోయారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పైసలు ఇస్తే తీసుకొని.. ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కే వేయాలని చెప్పారు. వారిచ్చే రెండు వేలు తీసుకొని మిగితా 58 వేలు ఎప్పుడిస్తారని ప్రశ్నించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

మరోవైపు దొంగ ఓట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే కాంగ్రెస్ దాదాపు 13 వేల దొంగ ఓట్లు సృష్టించినట్టు తెలుస్తోందని, ప్రజలు స్వయంగా బూత్‌లకు వెళ్లి ఓటు వేసి.. వాళ్లకు బుద్ధి చెప్పాలని అన్నారు. ఇది కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలన్న ఆయన.. బీఆర్‌ఎస్‌ను గెలిపించి బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్ ప్రజలకు పిలుపునిచ్చారు.