నిబంధనలు పాటించలేదు

22-08-2026 | 01:23am
  1. అందుకే సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు
  2. నిర్ణీత రూల్స్‌కు అనుగుణంగా ఉన్న యూకేకు ఆమోదం
  3. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ 

న్యూఢిల్లీ, ఆగస్టు 21: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తలపెట్టిన అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి నిరాకరించబడింది. ఈ పర్యటన నిర్ణీత నిబంధనలకు అనుగుణంగా లేకపోవడమే ఇందుకు కారణమని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) శుక్రవారం తెలిపింది. విదేశీ వ్యవహారాల శాఖ అనుమతి నిరాకరించడంతో ముఖ్యమంత్రి తన అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని సీఎంఓ ప్రకటించి న కొద్ది గంటలకే ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. రాజకీయ అనుమతిని మంజూరు చేయడానికి, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల పర్యటనలను విదేశీ వ్యవహారాల శాఖ పరిశీలిస్తుందన్నారు. ఇటువంటి సందర్భాల్లో ప్రతిపాదించిన కార్యక్రమం, వారు నిర్వహిస్తున్న పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా ఉండా లి. ఈ నిర్దిష్ట సందర్భంలో, అమెరికా పర్యటన విషయంలో ఆ నిబంధనలు పాటించలేదన్నారు.

అందువల్ల, అనుమతి ఇవ్వలేదు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి బ్రిటన్ (యూకే) పర్యటనకు మాత్రం అనుమతి లభించిందని రణధీర్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వరుసగా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో, వారు విదేశీ పర్యటనలు చేయడానికి రాజకీయ అనుమతులను విదేశీ వ్యవహా రాల శాఖ నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు