ఉప్పల్ భగాయత్ అభివృద్ధి బాధ్యత నాది
- రూ.3.50 కోట్లతో మల్టీ స్పోర్ట్స్ అరేనా పరిశీలన
- త్వరలో రూ.35 కోట్లతో ఫుట్‌పాత్‌ల నిర్మాణం
- పరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, ఆగస్టు 19విజయక్రాంతి : ఉప్పల్ భగాయత్ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మం దుముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో భగాయత్ అభివృద్ధికి అవసరమైన నిధులను తీసుకొచ్చి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు. బుధవారం ఉప్పల్ భగాయత్లో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న మల్టీ స్పోరట్స్ అరేనాను పరమేశ్వర్ రెడ్డి స్థానిక కాలనీవాసులు, హెచ్‌ఎండీఏ, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
పనుల పురోగతిని సమీక్షించి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీ స్పోరట్స్ అరేనాలో బేబీ పూల్, స్విమ్మింగ్ పూల్, ట్రిపుల్ జంప్, ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ వంటి ఆధునిక క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బహుళ క్రీడా సముదాయం అందుబాటులోకి వస్తే యువతకు మెరుగైన క్రీడా వేదిక లభించడంతో పాటు భగాయత్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.
భగాయత్లో ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే రూ.35 కోట్ల వ్యయంతో ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వక్కంటి శ్రీనివాస్ రావు, బిజ్జుల రవీందర్ రెడ్డి, వంశీ చంద్ర రెడ్డి, ఈగ సంతోష్, పూజల ప్రభాకర్, విశ్వనాథ్, శివ ప్రసాద్ రావు, సూర్యగోపాల్, చారి, తుమల దేవి రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, రఫిక్, సల్లా ప్రభాకర్ రెడ్డి, సుంకు శేఖర్ రెడ్డి, మంద మురళీకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






