calender_icon.png 8 December, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకం

08-12-2025 07:57:31 PM

సిద్దిపేట కలెక్టరేట్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వర్లకు సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి కె.హైమావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల విధులపై సమగ్ర అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్ అయోధ్య రెడ్డి మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల సమయంలో చేపట్టాల్సిన బాధ్యతలు, విధుల నిర్వహణపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వెబ్‌కాస్టింగ్ సదుపాయం లేని క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ సరళిని సున్నితంగా పర్యవేక్షించి, అవసరమైన నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల పరిశీలకులకు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

మాక్ పోలింగ్ నుంచి పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల్లో వసతులు, పోలింగ్ సమయం, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ ప్రతి దశను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మూడు విడతలుగా జరిగే పోలింగ్‌లో ముందురోజే ఆయా మండలాల్లో నివేదిక ఇవ్వాలని తెలిపారు. మైక్రో అబ్జర్వర్ల డ్యూటీ అత్యంత కీలకమని, కళ్లతోనే విధులు నిర్వహిస్తూ పూర్తిస్థాయి అవగాహనతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో రమేష్, డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎల్‌డీఎం హరిబాబు, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.