20-01-2026 12:17:23 AM
పల్లెల్లో పర్యాటక అభివృద్ధితో ఆర్థిక ప్రగతి సాధ్యం
గ్రామపంచాయతీ సర్పంచుల శిక్షణ తరగతుల్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 19 (విజయక్రాంతి): గ్రామాల సమగ్ర అభివృద్ధిలో గ్రామపంచాయతీ సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, ప్రభుత్వం అందిస్తున్న నిధులను నియమ నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా వినియోగించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సర్పంచులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కెఎస్‌ఎం ఓల్ క్యాంపస్)లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని మొత్తం 471 మంది గ్రామపంచాయతీ సర్పంచులకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని విడతల వారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు సోమవారం నుంచి ఈ నెల 23 వరకు, రెండవ దఫా ఫిబ్రవరి 2 నుంచి 7వ తేది వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 14 మండలాలకు చెందిన 237 మంది నూతన గ్రామపంచాయతీ సర్పంచులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైందని అధికారులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పాలన, పరిపాలన విధానాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ శిక్షణ కార్యక్రమాల లక్ష్యమని అన్నారు.
ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా సర్పంచులు నిరంతరం పర్యవేక్షించాలని, చిన్నారులు, బాలింతలకు పోషకాహారం సముచితంగా అందుతున్నదీ లేనిదీ పరిశీలించాలని సూచించారు. యువతను ప్రయోజకులుగా మార్చే దిశగా సర్పంచులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీపీఓ సుధీర్, శిక్షణ డీపీఓ అనూష, డీఎల్పీఓలు ప్రభాకర్, రమణ, టీజీఐఆర్టీ సెంటర్ హెడ్ సుభాష్ చంద్ర గౌడ్, ట్రైనర్లు బన్సింగ్, రవీందర్ రెడ్డి, సునీల్ కుమార్, ముత్యాలరావు, హజ్రత్ వలి, ఏపీవో రంగ, ఎస్బీఎం రేవతి, డిటిఎం సందీప్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.