25 April, 2026 | 3:40 AM

సర్కార్ నిర్లక్ష్యానికి బలైన ఆర్టీసీ బిడ్డ..

25-04-2026 02:01 AM

మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీఆర్పీ డిమాండ్

వరంగల్, ఏప్రిల్ 24,(విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల న్యాయపోరాటం ఉధృతమవుతున్న వేళ, ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ కార్మికుడు కోలా శంకర్ గౌడ్ అంతిమ యాత్రలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. నర్సంపేట నియోజకవర్గం ముతోజీ పేట వద్ద శంకర్ గౌడ్ భౌతికకాయానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ రాష్ట్ర,వరంగల్ జిల్లా నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల పొట్టకొట్టి, వారిని మానసిక క్షోభకు గురిచేసి చంపుతున్న ఈ ప్రభుత్వం, శంకర్ గౌడ్ మృతికి పూర్తి బాధ్యత వహించాలని,ఇది సహజ మరణం కాదు, ప్రభుత్వమే చేసిన హత్య అని ఆయన ఘాటుగా విమర్శించారు. తెలంగాణ తెచ్చుకుంది కార్మికుల ప్రాణాలు పోవడానికా అని ప్రశ్నించారు.

కోలా శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీఆర్పీ విశ్రమించదని,మృతుని కుటుంబానికి తక్షణమే కోటి రూపాయల భారీ పరిహారం చెల్లించి, కుటుంబంలో ఒకరికి  ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలు పుతున్న టీఆర్పీ నాయకులను ప్రభుత్వం పోలీసు బలగాలతో అక్రమంగా అరెస్టు చేయించడాన్ని అశోక్ ముదిరాజ్  తీవ్రంగా ఖండించారు. అరెస్టులు చేసినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడుతాడని హెచ్చరించారు. టీఆర్పీ రాష్ట్ర నాయకులు, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.