31 May, 2026 | 1:06 AM

రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్‌కు ఉరితాడు

31-05-2026 12:32 AM
  1. సోలార్ పవర్ మాత్రమే కేటాయించే కుట్ర
  2. మాజీ మంత్రి హరీశ్ రావు  

నంగునూరు, మే 30(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న రైతు డిస్కం వల్ల రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌కు ఉరితాడు పడబోతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయి గ్రామంలో ఆగి ఆయన స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ రైతు డిస్కంకు కేవలం సోలార్ పవర్ మాత్రమే కేటాయించే కుట్ర జరుగుతోందని,దీనివల్ల పొద్దున సూర్యుడు వచ్చాకే మోటార్లు ఆన్ అయి,సాయంత్రం ఐదు గంటలకే బంద్ అవుతాయన్నారు.

ఫలితంగా రైతులకు కేవలం 7 నుంచి 8 గంటల కరెంటు మాత్రమే దక్కుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎకరా రూ. 50 లక్షలు పలికిన భూముల ధరలు, నేడు కాంగ్రెస్ పాలనలో రూ. 30 లక్షలకు కూడా కొనే నాథుడు లేక పాతాళానికి పడిపోయాయని మండిపడ్డారు. రైతులకు కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తుందని చెప్పి, రాగానే రైతుబంధుకు ఎగనామం పెట్టిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో పంట కొనుగోళ్లు సాఫీగా సాగితే.. నేడు కాంగ్రెస్ పాలనలో కొనుగోలు కేంద్రాల్లో ఏ-గ్రేడ్ రకాన్ని తీసేసి, తరుగు పేరుతో నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆధార్య పడొద్దన్నారు.