చికాగో వీరుల త్యాగఫలం కార్మిక వర్గానికి దిక్సూచి
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం, మే 1 (విజయక్రాంతి): చికాగో వీరుల త్యాగఫలం ప్రపంచ కార్మిక వర్గానికి దిక్సూచి అని, నాడు ఎనిమిది గంటల పనిదినం కోసం ప్రాణాలర్పించిన వారి స్ఫూర్తితో హక్కుల రక్షణకు సమరశీల పోరాటాలు సాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపు నిచ్చారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం 141వ మేడే ఉత్సవాలు శుక్రవారం సిపిఐ, ఏఐటీయూసీ, అనుబంధ ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
ప్రధాన కూడళ్లు, హమాలీ అడ్డలు, ఆటో స్టాండ్లు, భవన నిర్మాణ కార్మిక క్షేత్రాలు, యూనియన్, పార్టీ కార్యాలయాలు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ఎర్రజెండాను ఎగురవేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోస్టాఫీసు సెంటర్లో నిర్వహించిన భారీ ప్రదర్శన నిర్వహించారు. జెండావిష్కరణల అనంతరం జరిగిన సభల్లో మాట్లాడుతూ కేంద్రంలోని పాలకులు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక చట్టాలను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు.
దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం దేశ ప్రయోజనాలకు విఘాతమని, ఈ దుర్మార్గపు విధానాలపై కార్మికులు ఐక్యంగా పోరాడాలని కోరారు. జిల్లా వ్యాపితంగా 723 కేంద్రాల్లో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించి చికాగో అమరవీరుల త్యాగాలు గుర్తుచేసుకున్నామని, కార్మికవర్గ పోరాటాలకు ఈ ఉత్సవాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా నాయకులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి మురళి, కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, గెద్దాడు నగేష్, ఎస్ కె ఫహీమ్, కె రత్నకుమారి, భూక్యా శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.






