సైదాబాద్ ఫ్లైఓవర్‌కు సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి
- ఆమె విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలి
- బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, ఫ్లైఓవర్కు స్వాతంత్ర సమరయోధురాలు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టడంతో పాటు ఆమె కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో బీసీ జేఏసీ కార్యాలయంలో సోమవారం కో-చైర్మన్ టి.నందగో పాల్ అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంగం లక్ష్మీబాయి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని, 1952లో ఇందిరా సేవా సదన్ స్థాపించి మహిళలు, అనాథలు, పేదలకు విద్య అందించారని, సైదాబాద్లోని తన రెండు ఎకరాల ఆస్తిని అనాథల కోసం దానం చేశారని కొనియాడారు.
అలాంటి మహనీయురాలిని గత, ప్రస్తుత ప్రభుత్వాలు విస్మరించాయని అన్నారు. జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పీవీ నరసింహా రావు, ఎన్టీ రామారావు, మాధవ రెడ్డి, జైపాల్ రెడ్డి, నాయి నరసింహా రెడ్డి తదితరుల పేర్లతో పార్కులు, ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు ఉన్నప్పటికీ బీసీ నేతలకు తగిన గౌరవం దక్కలేదని విమర్శించారు. సంగం లక్ష్మీబాయి జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని, ఆమె పేరుతో స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు.
డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కనకాల శ్యాం కురుమ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్, రావులకు కిషోర్ యాదవ్, రావులకోల్ నరేష్ ప్రజాపతి, సంధ్యారాణి, సురేష్ యాదవ్, బూడిద మల్లికార్జున్ యాదవ్, పానుగంటి విజయ్, సురిగి నరసింహ గౌడ్, సంతోష్, రాకేష్, శ్రీకాంత్, అనంతుల సాయి పవన్ పాల్గొన్నారు.






