14 May, 2026 | 1:42 AM

కేరళంలో ‘పీఠ’ముడి!

14-05-2026 12:00 AM

కేరళంతో పాటు ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ప్రభుత్వాలు కొలువైనప్పటికీ, కేరళం పంచాయితీ మాత్రం ఎంతకీ తెగడం లేదు. ఆ రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి మరో రాజకీయ పరీక్షగా మారడమే అందుకు కారణం. కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేష్ చెన్నితల లాంటి హేమాహేమీలు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడుతుండటం, కొత్త ప్రభుత్వం కొలువ య్యేందుకు మరో పది రోజుల సమయమే ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల పోరుకు మించి సీఎం ఎంపిక హస్తం పార్టీకి సవాల్ విసురుతున్నదని చెప్పాలి.

గతంలో కేరళంలో విజయం సాధించినప్పుడు క్యాడర్, లీడర్లను సమన్వయం చేసుకునే ఉమెన్‌చాందీ వంటి ప్రజానేత ఉండటంతో కాంగ్రెస్‌కు ఇలాంటి తలనొప్పి రాలేదు. కానీ, నేడు ఒకవైపు రాష్ట్ర రాజకీయాలపై గట్టి పట్టున్న సతీశన్, మరోవైపు ఢిల్లీ హైకమాండ్‌తో సాన్నిహిత్యం ఉన్న కేసీ వేణుగోపాల్ పరోక్షంగా బలప్రదర్శనకు దిగడంతో సీఎం ఎంపికపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతున్నది. అయితే, ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి కొత్త కావు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రులను ఢిల్లీ అధిష్ఠానం ఎంపిక చేయడం మొదటినుంచీ సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘షీల్డ్ కవర్ సీఎం’ అనే అపవాదును ఆ పార్టీ మూటగట్టుకున్న విషయాన్ని పక్కనపెడితే, జాతీయ రాజకీయాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వర్గపోరు కాంగ్రెస్‌కు ఏ మాత్రం మంచిది కాదని చెప్పాలి. 2014లో బీజేపీ హవా మొదలయ్యాక కాంగ్రెస్ పార్టీ అడపాదడపా కొన్ని రాష్ట్రాల్లోనే  గెలుస్తున్న విషయం కాదనలేని వాస్తవం.

ఆ రాష్ట్రాల్లోనూ ఇలాగే ఆలస్యం చేసి, ఆ పార్టీ మూల్యం చెల్లించుకున్నది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింధియా అసంతృప్తి ప్రభుత్వ పతనానికి దారితీసిన ఉదంతాన్ని ఎవరూ మర్చిపోలేదు. రాజస్థాన్‌లో సచిన్ పైలట్ చేసిన తిరుగుబాటు ఆ పార్టీని సంక్షోభంలోకి నెట్టివేసింది. కర్ణాటకలో జరుగుతున్న కుర్సీ కా కిస్సాను చూస్తూనే ఉన్నాం.

ఈ అనుభవాల దృష్ట్యా అసంతృప్త నేతలకు కీలక మంత్రిత్వ శాఖలు, పార్టీలో పదవులు కట్టబెట్టి సమన్వయం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తున్నా, ఈ ఆలస్యం కాంగ్రెస్‌కు మళ్లీ నష్టం చేకూర్చే ప్రమాదం లేకపోలేదనే విశ్లేషణలు వినవస్తున్నాయి. అసంతృప్తులను విస్మరించి, సీఎం ఎంపికలో తొందరపడ్డా వర్గ పోరు ముదిరే అవకాశముందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాంటి ఈ సమస్యను పరిష్కరించుకొని భవిష్యత్తు దిశగా కాంగ్రెస్ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.