14 May, 2026 | 1:42 AM

ఆహారం కాదు, రసాయనాలు తింటున్నాం!

14-05-2026 12:00 AM

మేకల కృష్ణ :

ఆధునిక జీవన విధానంలో మనం తినే ప్రతి ఆహార పదార్థంలోనూ రసాయనాలు చాపకింద నీరులా వచ్చి చేరుతున్నాయి. మనిషి తన నిత్య జీవితంలో తనకు తెలియకుండానే క్యాన్సర్ కారక రసాయనాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. కూరగాయల సాగులో మితిమీరి వాడుతున్న క్రిమిసంహారక మందులు, పండ్లను కృత్రిమంగా పండించడానికి ఉపయోగించే కార్బైడ్ వంటి కెమికల్స్ మన భోజనాన్ని విషమయం చేస్తున్నాయి.

లాభాపేక్షతో కొందరు చేస్తున్న కల్తీ వల్ల మనుషులు ప్రాణాంతక క్యాన్సర్ బారినపడు తున్నారు. ఒకప్పుడు అరుదుగా కనిపించే క్యాన్సర్ మహమ్మారి, నేడు వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ కబళిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 97 లక్షల మంది మరణించారు.

2050 నాటికి 3.5 కోట్లకు పైగా దీని బారిన పడే అవకాశం ఉందని చెప్పడం ఆందోళనకరం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదికల ప్రకారం మన దేశంలో ఏటా క్యాన్సర్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. భారత్‌లో 2024 నాటికి కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య సుమారు 15.6 లక్షలకు చేరిందని అంచనా. మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరు తమ జీవితకాలంలో క్యాన్సర్ బారినపడే ప్రమా దం పొంచి ఉందని గణాంకాలు చెప్తున్నాయి.

కలుషితాహారం, పురుగుల మందుల వాడకం వల్ల పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా.. గ్రామీణ ప్రాంతా ల్లో సైతం క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం మరింత ఆందోళనకరం. ఈ మహమ్మారి విజృంభణకు ప్రధాన కారణం మన ఆహార పు అలవాట్లలో వచ్చిన మార్పులే. జంక్ ఫు డ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారపదార్థాల్లో రుచి కోసం రకరకాల రసాయనాలు వాడుతున్నారు. మైక్రో ఓవెన్లలో మితిమీరి వేడి చేయడం, మాంసాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల క్యాన్సర్ కారక శక్తులు పుట్టుకొస్తున్నాయి.

అలాగే, వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో లేదా ప్రింటింగ్ సిరా ఉన్న పత్రికల్లో ప్యాక్ చేయ డం, ప్లాస్టిక్ కప్పుల్లో చాయ్ తాగడం వల్ల ఆ కెమికల్స్ ఆహార పదార్థాల్లో కలిసి శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’  హెచ్చరించింది. ఆహార కల్తీలతో పాటు శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం, పొగాకు, ధూమపానం, మద్యపాన వ్యసనాలు క్యాన్సర్ ముప్పును రెట్టింపు చేస్తున్నాయి.

ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరగడానికి పొగాకు ఉత్పత్తులే ప్రధాన కారణమని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు విస్తరిస్తున్నాయి. ఆధునిక జీవనశైలిలోని ఒత్తిడి, కలుషిత గాలి, రసాయనాల ప్రభావం మానవ శరీర నిరోధక శక్తిని దెబ్బతీసి, క్యాన్సర్ కణాల ఉత్పత్తికి కారణమవుతున్నాయి. ఆహార భద్రత విషయంలో ప్రభుత్వాల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే వ్యవస్థ నామమాత్రంగా మారడం, ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించడానికే పరిమితమవడం, చట్టాలు కఠినంగా లేకపోవడం శోచనీయం. ప్రజల ప్రాథమిక హక్కు అయిన ‘సురక్షితమైన ఆహారం’ అందించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని చెప్పక తప్పదు. ఈ మహమ్మారి బారినుంచి తప్పించుకోవాలంటే మనిషి తన జీవనశైలిలో తక్షణ మార్పులు చేసుకోవాలి. సాధ్యమైనంతవరకు సేంద్రీయ ఆహార పదార్థాలను తీసుకోవాలి.

రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, తాజా పండ్లు, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవడం అవసరం. ముఖ్యంగా క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ప్రతి ఒక్క రూ 40 ఏళ్లు దాటిన తర్వాత వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

క్యాన్సర్ ఒక సామాజిక సంక్షోభం. ప్రభుత్వం క్యాన్సర్ ఆసుపత్రుల సంఖ్యను పెంచడంపైనే కాకుండా, నివారణ చర్యలపైనా దృష్టిపెట్టాలి. ఆహార కల్తీలకు పాల్ప డే వారిపై ఉక్కుపాదం మోపాలి. ప్రజల్లోనూ క్యాన్సర్‌పై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది.

 వ్యాసకర్త సెల్: 9948556978