27-10-2025 09:52:21 PM
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్..
కరీంనగర్ (విజయక్రాంతి): కోవిడ్ మహమ్మారి సమయంలోనూ, అనేక క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు అంగన్ వాడీలు అందించిన సేవలు మరువలేమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరంలోని కళాభవన్ లో సోమవారం మహళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించిన ‘పోషణ మాసం’ ముగింపు ఉత్సవాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ప్రజలకు ఆరోగ్యం, పోషణపట్ల అవగాహన కల్పించేందుకు మహిళలు ఏర్పాటు చేసి స్టాళ్లను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల సేవలను గుర్తించడంతో పాటు వేతనాలను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీజేపీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అంగన్ వాడీలకు వేతనాలను పెంచుతామని చెప్పారు. చిన్నారులకు పోషణ, ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించేందుకు మహిళలు చేతి గ్లౌజ్ తరహాలో తయారు చేసిన ఉత్పత్తులు బాగున్నాయని, వీటిని ప్రతి ఒక్క పిల్లవాడికి అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎంపీ నిధుల నుండి వాటిని కొనుగోలు చేయించేందుకు సిద్ధమని చెప్పారు. అలాగే గతంలో ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.12 లక్షలు కూడా కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో ఒకప్పుడు చిన్నపిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బందులు పడ్డారని, అనేక వ్యాధుల బారిన పడ్డారని చెప్పారు.
మోదీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు పౌష్టికాహారం అందించేందుకు శ్రీకారం చుట్టడమే కాకుండా విజయవంతంగా పోషణ్ అభియాన్ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు పేరుతో ఉచితంగా రూ.5 లక్షల వైద్యం అందిస్తోందన్నారు. బస్తీ దవాఖానాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున కేంద్రమే నిధులు ఇస్తోందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, సూదులు, దూది సహా అన్ని వస్తువులు కేంద్ర నిధుల ద్వారా కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు.
ఆసుపత్రులకు భవనాల నిర్మాణానికి సైతం కేంద్రమే నిధులు ఇస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ 2018, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మిషన్ సాక్ష్యం అంగన్ వాడీ, పోషణ్ 2.0 అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంలో కరీంనగర్ ముందంజలో ఉండటం సంతోషకరమని, ఈ విషయంలో అంగన్ వాడీల సేవలను, అధికారుల సమన్వయంతో పనిచేస్తున్న తీరు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అశ్వినీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, పలువురు ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.