27-10-2025 09:14:38 PM
తహసీల్దార్ శ్రీనివాసరావు..
నూతనకల్ (విజయక్రాంతి): రాబోయే భారీ వర్షాల నేపథ్యంలో రైతుల ధాన్యాన్ని సురక్షితంగా, పారదర్శకంగా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని తహసీల్దార్ శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సోమవారం స్థానిక ఎంపీడీవో, ఏపీఓ, వ్యవసాయ అధికారులతో తహసీల్దార్ శ్రీనివాసరావు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యంగా రాబోయే భారీ వర్షాల నుండి ధాన్యాన్ని రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి కేంద్రం ఇన్‌చార్జులకు దిశానిర్దేశం చేశారు. కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని, ధాన్యాన్ని తడవకుండా కవర్లు, ఇతర ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి, ఎటువంటి లోపాలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించడానికి 'టోకెన్ పద్ధతి'ని అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం, ప్రతి కొనుగోలు కేంద్రంలో టోకెన్ రసీదులను అందుబాటులో ఉంచాలని అధికారులకు తెలియజేశారు. ఈ విధానం ద్వారా, రైతులు తమ ధాన్యంలో నిర్ణీత తేమ శాతం వచ్చిన వెంటనే, సంబంధిత ఏఈఓ దానిని నిర్ధారిస్తారని, ఏఈఓ ధృవీకరించిన తర్వాతే రైతులకు టోకెన్లు జారీ చేయబడతాయన్నారు. ఈ టోకెన్ల ఆధారంగానే ధాన్యం కొనుగోల ప్రక్రియ పూర్తి అవుతుందని, ఈ టోకెన్ విధానం ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా, ఎటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా, పూర్తి పారదర్శకతతో నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యంపిడిఓ సునీత, ఏపిఓ శ్రీరాములు,ఆయా గ్రామాల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.